అహ్మదాబాద్, ఆగస్టు 28: ఇప్పటికే పలు రాష్ర్టాల్లో ప్రజా ప్రభుత్వాలను కూలదోస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న బీజేపీ.. రాజ్యాంగాన్నీ ఖూనీ చేసే నిర్ణయాలు తీసుకొంటున్నది. బీజేపీ అధికారంలో ఉన్న గుజరాత్ ప్రభుత్వం.. సమాచార హక్కు కార్యకర్తలపై నిషేధం విధించింది. ఆర్టీఐ కింద దరఖాస్తు చేసుకోకుండా 2021 జనవరి నుంచి ఇప్పటి వరకు మొత్తం 10 మందిని గుజరాత్ సమాచార కమిషన్ బ్యాన్ చేసింది. ఈ చర్యలపై మాజీ భారత సమాచార కమిషనర్లు, ఆర్టీఐ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం పరిమితి దాటి వ్యవహరించటమేనని, పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమైన చర్య అని మండిపడుతున్నారు.
ఆర్టీఐ కార్యకర్తలపై నిషేధాన్ని ఖండిస్తూ ఈ నెల 26న వెబినార్ కూడా నిర్వహించారు. ఈ వెబినార్‌లో నేషనల్ క్యాంపెయిన్ ఫర్ పీపుల్స్ రైట్ టు ఇన్ఫర్మేషన్ కో కన్వీనర్ అంజలి భరద్వాజ్, సీఐసీ మాజీ చీఫ్ వజాహత్ హబీబుల్లా, సీఐసీ మాజీ సమాచార కమిషనర్లు యశోవర్ధన్ ఆజాద్, శైలేశ్ గాంధీ, మధ్యప్రదేశ్ సమాచార కమిషనర్ రాహుల్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గుజరాత్ సమాచార కమిషనర్ తన పరిధిని మించి వ్యవహరిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాజ్యాంగాన్ని ధిక్కరించటమే
రాజ్యాంగం కల్పించిన సమాచార హక్కును బీజేపీ పాలిత గుజరాత్‌లోని సమాచార కమిషన్ ధిక్కరిస్తున్నదని అంజలి భరద్వాజ్ తెలిపారు. ప్రభుత్వానికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకొనే హక్కును చట్టం కల్పించిందని, కారణాలు చెప్పి సమాచారాన్ని దాచిపెట్టడం సరికాదని వెల్లడించారు. అదీకాక, ఆర్టీఐ కార్యకర్తలు భవిష్యత్తులో దరఖాస్తు చేయకుండా నిషేధం విధించటం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు.
జీవితకాల నిషేధం ఎందుకు?
గుజరాత్ సమాచార కమిషన్ తొలిసారి 2017 జూలైలో ఒక దరఖాస్తుదారుడిని బ్లాక్ చేసింది. 2020 డిసెంబర్లో ఆర్టీఐని వాడుకోకుండా మరొకరిని నిషేధించింది. అప్పటి నుంచి 15 బ్లాక్‌లిస్టింగ్ ఆదేశాలు, 10 మందిపై నిషేధం విధించింది. అందులో ఒక వ్యక్తి మినహా అందరిపైనా జీవితకాల నిషేధం విధించింది. ఈ చర్యలను వెబినార్‌లో ఆర్టీఐ మాజీ అధికారులు, కార్యకర్తలు తీవ్రంగా ఖండించారు. ఆ నిషేధాన్ని తొలగించాలని దరఖాస్తుదారుల పక్షాన పోరాడుతున్న పంక్తి జోషి మాట్లాడుతూ.. ‘దరఖాస్తుదారులు తప్పుగా ప్రవర్తించారని, ప్రభుత్వ అధికారులను వేధింపులకు గురి చేశారని’ అసంబద్ధ కారణాలు చెప్తూ నిషేధం విధించారని మండిపడ్డారు.
సీఐసీ మాజీ చీఫ్ హబీబుల్లా మాట్లాడుతూ.. ఆర్టికల్ 19 (1)(ఏ) ప్రకారం సమాచారం పొందటం రాజ్యాంగం కల్పించిన హక్కు అని స్పష్టం చేశారు. సమాచారం కోరకుండా ఒక పౌరుడిపై సుప్రీంకోర్టే నిషేధం విధించే అధికారం లేనప్పుడు, సమాచార కమిషన్‌కు ఎలా ఉంటుందని ప్రశ్నించారు. రాష్ట్రపతి, ప్రధానమంత్రి, సుప్రీంకోర్టే ఏ పౌరునిపై నిషేధం విధించనప్పుడు గుజరాత్ సమాచార కమిషన్ ఎలా విధిస్తుందని శైలేష్ గాంధీ నిలదీశారు. సమాచార కమిషన్ నిర్ణయం నియంతృత్వానికి అద్దం పడుతున్నదని యశోవర్ధన్ విమర్శించారు.