న్యూఢిల్లీ: దేశంలో కరోనా కొత్త వేరియెంట్ ఒమిక్రాన్ వేగంగా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీ ఇవాళ ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం ( PM Review meeting ) నిర్వహించనున్నారు. ఈ సాయంత్రం 6.30 గంటలకు సమావేశం మొదలవుతుందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. దేశంలో కరోనా పరిస్థితి, ఒమిక్రాన్ వేరియంట్ విస్తృతి, వైరస్ కట్టడి కోసం తీసుకుంటున్న చర్యలు, వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పరిస్థితులు తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నది.
ఇదిలావుంటే, కేంద్ర ప్రభుత్వం ఒమిక్రాన్ విస్తృతిపై కొంత ఆలస్యంగానైనా దృష్టిసారించింది. ఒమిక్రాన్ వేరియంట్ కేసులు అధికంగా ఉన్న ప్రాంతాల్లో నైట్ కర్ఫ్యూలు విధించాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఈ నెల 20న మార్గదర్శకాలు జారీచేసింది. ఆయా ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించాలని సూచించింది. కాంటాక్ట్ ట్రేసింగ్, ట్రాకింగ్, ట్రీట్మెంట్ విషయాల్లో కచ్చితత్వంలో ఉండాలని ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించింది.