Droupadi Murmu : బీజేపీ సీనియర్ నాయకుడు (BJP senior leader), మాజీ ఎంపీ (Ex MP) విజయ్ కుమార్ మల్హోత్రా (Vijay Kumar Malhotra) మృతికి రాష్ట్రపతి (President of India) ద్రౌపది ముర్ము (Draupadi Murmu) సంతాపం తెలియజేశారు. మంగళవారం మధ్యాహ్నం రాష్ట్రపతి ముర్ము మల్హోత్రా నివాసానికి వెళ్లి, ఆయన పార్థివదేహాన్ని సందర్శించి, నివాళులు అర్పించారు. ఆయన భౌతికకాయం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి అంజలి ఘటించారు. అంతకుముందు ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ కూడా మల్హోత్రా ఇంటికి వెళ్లి నివాళులు అర్పించారు.
కాగా 94 ఏండ్ల విజయ్ కుమార్ మల్హోత్రా గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఢిల్లీ ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఇవాళ ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్త తెలిసి పలువురు బీజేపీ నేతలు, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తంచేస్తున్నారు. కాగా విజయ్ కుమార్ మల్హోత్రా.. ఐదుసార్లు ఎంపీగా, రెండుసార్లు ఢిల్లీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఢిల్లీలో పార్టీ బలోపేతం కోసం ఎంతో కృషి చేశారు.
రెండుసార్లు ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడిగా కూడా ఆయన పనిచేశారు. మల్హోత్ర మృతికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సహా పలువురు కేంద్ర మంత్రులు సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. పార్టీ కోసం మల్హోత్ర చేసిన సేవలను పలువురు గుర్తుచేసుకున్నారు.