డెహ్రాడూన్ : హరిద్వార్ పతంజలి యూనివర్సిటీ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ పాల్గొన్నారు. రెండు రోజుల పర్యటన కోసం హరిద్వార్‌కు వచ్చిన రాష్ట్రపతికి యోగా గురువు బాబా రామ్‌దేవ్, ఆచార్య బాలకృష్ణ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జరిగిన కాన్వొకేషన్లో పాల్గొన్న ఆయన.. డిగ్రీలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను అభినందించి, ఉజ్వల భవిష్యత్‌ను ఆకాంక్షించారు. అనంతరం మాట్లాడుతూ యూనివర్సిటీకి రావడం చాలా ఆనందంగా ఉందన్నారు.
బాబా రామ్‌దేవ్ యోగా నిర్వచనాన్నే మార్చివేశారన్నారు. పది, పదిహేనేళ్ల కిందట యోగాను భారత్‌లో తపస్సుగా భావించే వారని.. యోగులు, సన్యాసులు మాత్రమే సాధన చేసుకునే వారనుకున్నారని, కానీ బాబా రామ్‌దేవ్ యోగా నిర్వచనాన్ని మార్చారన్నారు. యోగాకు ఆదరణ పెంచడంలో బాబా రామ్‌దేవ్ చేస్తున్న కృషిని అభినందిస్తూ, నేడు యోగాతో అసంఖ్యాక ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. యోగా అనేది సంస్కారానికి సంబంధించినది కాదని, ఇది శరీరాన్ని, నసును ఆరోగ్యంగా ఉంచే విధానమన్నారు.
పతంజలి గ్రూప్‌కు చెందిన విద్యాసంస్థలో భవిష్యత్ తరాన్ని దేశ నిర్మాణానికి సిద్ధం చేస్తుందన్నారు. దీంతో భారత్ అభివృద్ధి చెందుతుందన్నారు. కార్యక్రమంలో సన్మానించిన విద్యార్థుల్లో బాలికలే 60 శాతం మంది ఉండడంపై హర్షం వ్యక్తం చేసిన ఆయన, పతంజలి విద్యాసంస్థల్లో ఆడపిల్లలు ఎక్కువగా ఉండడం సంతోషించదగ్గ విషయమన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద కరోనా వ్యాక్సినేషన్ దేశంలో విజయవంతంగా కొనసాగుతుందన్నారు. ప్రకృతికి అనుగుణంగా జీవన శైలిని అలవర్చుకోవాలని సూచించారు.
సహజ ఉత్పత్తులను వినియోగించడం ద్వారా చాలా ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఇదిలా ఉండగా.. పతంజలి కాన్వొకేషన్ ఏప్రిల్‌లో జరగాల్సి ఉండగా.. కొవిడ్ కారణంగా వాయిదా పడింది. కార్యక్రమంలో ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి సహా పలువురు నేతలు పాల్గొన్నారు. అంతకుముందు రాష్ట్రపతి జాలీ గ్రాంట్ విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి, గవర్నర్ సహా ఇతర వ్యక్తులు ఆయనకు స్వాగతం పలికారు. ఇక్కడి నుంచి హెలికాప్టర్లో హరిద్వార్‌కు బయలుదేరారు. సోమవారం దేవ్ సంస్కృత విశ్వవిద్యాలయంలో జరిగే కార్యక్రమానికి హాజరుకానున్నారు.