Malaria Vaccine | త్వరలోనే మలేరియా నివారణకు సంబంధించిన అధునాతన వ్యాక్సిన్ ఉత్పత్తి మొదలుకానున్నది. ఈ వ్యాక్సిన్‌ను తయారు చేసేందుకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) చొరవ తీసుకుంది. అడ్ఫాల్సివాక్స్ (AdFalciVax) పేరు గల వ్యాక్సిన్ వాణిజ్య ఉత్పత్తి కోసం కంపెనీలు, వ్యాక్సిన్ తయారీదారుల నుంచి ఆసక్తి వ్యక్తీకరణ (EoL) కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. ఐసీఎంఆర్ చొరవతో భారత్‌లో డెంగ్యూ కంటే ముందే మలేరియాను నిర్మూలించవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. భారత శాస్త్రవేత్తలు మలేరియాకు వ్యతిరేకంగా తొలి స్వదేశీ వ్యాక్సిన్‌ను తయారు చేశారు. ఇది మలేరియా వ్యాప్తిని పూర్తిగా నివారించనున్నది. అదే సమయంలో ఇతరులకు వ్యాప్తి చెందకుండా నిరోధించగలిగే సత్తా ఈ వ్యాక్సిన్‌కు ఉంది. మలేరియా వ్యాక్సిన్‌పై పరిశోధనలు పూర్తి చేసినట్లు ఐసీఎంఆర్ పేర్కొంది. ప్రస్తుతానికి ఈ వ్యాక్సిన్‌కు ‘Adfalcivax’ పేరు పెట్టారు. ఇది మలేరియా పరాన్నజీవి ప్లాస్మోడియం ఫాల్సిపరంపై పూర్తిగా ప్రభావవంతంగా ఉన్నట్లు గుర్తించారు. ఐసీఎంఆర్, భువనేశ్వర్ ప్రాంతీయ వైద్య పరిశోధన కేంద్రం (RMRC) పరిశోధకులు సంయుక్తంగా ఈ స్వదేశీ వ్యాక్సిన్‌ను తయారు చేశారు.
భారత్‌లో ప్రతి సంవత్సరం దోమల ద్వారా సంక్రమిస్తున్న వ్యాధులు భారత ఆరోగ్యసేవలపై భారీగా ఒత్తిడిని పెంచుతున్నాయి. ముఖ్యంగా వర్షాకాలం సమయంలో ప్రమాదం గణనీయంగా పెరుగుతుంది. డెంగ్యూ, మలేరియా, చికున్ గున్యా వంటి వ్యాధుల కారణంగా పెద్ద సంఖ్యలో జనం ఆసుపత్రి పాలవుతున్నారు. కొందరిలో వీటి కారణంగా ప్రాణాంతక దుష్ప్రభావాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో మలేరియా నివారణకు భారత్ తొలి స్వదేశీ టీకాను సిద్ధం చేసింది. వ్యాక్సిన్ సమర్థవంతంగా పని చేస్తున్నట్లు తేలడంతో ఐసీఎంఆర్ వ్యాక్సిన్ ఉత్పత్తి కోసం ప్రైవేట్ కంపెనీలతో ఒప్పందం చేసుకునేందుకు దరఖాస్తులను ఆహ్వానించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తాజా ప్రపంచ మలేరియా నివేదిక ప్రకారం.. 2023 సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా 263 మిలియన్ (26.3 కోట్లు) మలేరియా కేసులు నమోదయ్యాయని, ఇందులో 5.97 లక్షల మంది మరణించారని అంచనా.
WHO నివేదిక ప్రకారం, భారతదేశంలో 2017లో 64 లక్షలుగా ఉన్న మలేరియా కేసుల సంఖ్య 2023 నాటికి 20 లక్షలకు తగ్గింది. కొత్త కేసులు 69శాతం తగ్గుదల కనిపించింది. మలేరియా కారణంగా మరణాలు 11,100 నుంచి 3,500కి తగ్గాయి. స్వదేశీ వ్యాక్సిన్ తయారీతో మలేరియా ప్రభావం మరింత తగ్గుతుందని పేర్కొంటున్నారు. వాస్తవానికి ప్రస్తుతం రెండు మలేరియా వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. వాటి ధర ఒక్కో మోతాదుకు రూ.250 నుంచి రూ.830 వరకు ఉంటుంది. వాటి సమర్థత రేటు 33శాతం నుంచి 67 శాతం వరకు మాత్రమే ఉంటుంది. అయితే, ఇప్పటికే ఉన్న వ్యాక్సిన్ల మాదిరిగా కాకుండా, అడ్ఫాల్సివాక్స్ డబుల్ ఫేజ్ రక్షణను ఇస్తుంది. ధర సైతం తక్కువగానే ఉండనుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ ఆర్ఎంఆర్సీ వ్యాక్సిన్ విస్తృతంగా రక్షణ ఇస్తుందని, ఇన్ఫెక్షన్ను నిరోధించే బలమైన యాంటీబాడీలను తయారు చేస్తాయని పరిశోధకులు తెలిపారు. ఈ వ్యాక్సిన్ సాధారణ గది ఉష్ణోగ్రతల్లో తొమ్మిది నెలలకుపైగా ప్రభావవంతంగా ఉంటుందని.. కోల్డ్ చైన్ లాజిస్టిక్ అవసరాలను తొలగిస్తుందని పేర్కొంటున్నారు. టీకా కారణంగా దశాబ్దానికిపైగా రక్షణ ఉంటుందని పేర్కొంటున్నారు.