న్యూఢిల్లీ, మార్చి 20 : పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో దేశంలో పెట్రో వాత మొదలైంది. దేశంలో శుక్రవారం ప్రీమియం లేదా హయ్యర్ గ్రేడ్ పెట్రోల్ ధర లీటరుకు రూ.2 చొప్పున పెరిగింది. అదే విధంగా పారిశ్రామిక వినియోగం కోసం కొనుగోలు చేసే బల్క్ డీజిల్ రేటు లీటరుకు దాదాపు రూ. 22 పెరిగింది. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా ప్రపంచ చమురు ధరలు పెరగడంతో ఈ పెంపు ఏర్పడింది.
అయితే సాధారణ పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎటువంటి మార్పు లేదు. ప్రీమియం 95-ఆక్టేన్ పెట్రోల్ ధర ఢిల్లీలో లీటరు రూ. 99.89 నుంచి రూ. 101.89కి పెరిగింది. అదే విధంగా బల్క్ లేదా ఇండస్ట్రియల్ డీజిల్ ధర ఢిల్లీలో లీటరు రూ.87.67 నుంచి రూ. 109.59కి చేరుకుంది. ఇరాన్ యుద్ధం తీవ్రస్థాయికి చేరుకోవడంతో గురువారం అంతర్జాతీయ ముడి చమురు ధర బ్యారెల్ 119 డాలర్లు ఉంది.