Ambulance Explodes | మహారాష్ట్రలో ఘోర ప్రమాదం చోటు చేసుకున్నది. జల్గావ్ జిల్లాలో అంబులెన్స్ ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. ఆ తర్వాత ఆక్సిజన్ సిలిండర్ పేలిపోయింది. గర్భిణితో పాటు ఆమె కుటుంబం తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన బుధవారం జరగ్గా.. ఆక్సిజన్ సిలిండర్ పేలుడు ధాటికి చుట్టుపక్కల ఉన్న ఇండ్ల అద్దాలు సైతం పగిలిపోయినట్లు తెలుస్తున్నది. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని పోలీసు అధికారులు పేర్కొన్నారు.
వివరాల్లోకి వెళితే.. జల్గావ్లోని దాదావాడి సమీపంలోని జాతీయ రహదారిపై అంబులెన్స్‌లో పేలుడు జరిగింది. ఓ గర్భిణితో పాటు కుటుంబీకులను ఎరండోల్ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి జల్గావ్ జిల్లా హాస్పిటల్‌కు తరలిస్తున్న సమయంలో అంబులెన్స్‌లో మంటలు చెలరేగాయి. డ్రైవర్ ఇంజిన్‌లో నుంచి మంటలు రావడం గమనించి వెంటనే వాహనాన్ని నిలిపివేశాడు. ఆ తర్వాత వాహనంలో ఉన్న వారందరినీ దింపివేశాడు. ప్రమాదం తర్వాత పలువురు అక్కడికి చేరుకోగా.. దూరంగా ఉండాలంటూ అప్రమత్తం చేశాడు. ఆ తర్వాత కొద్ది సమయానికి అంబులెన్స్‌లో ఉన్న ఆక్సిజన్ ట్యాంక్ భారీ శబ్దంతో పేలిపోయింది. ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదని.. అంబులెన్స్‌లో ఉన్న వారంతా సురక్షితంగా బయటడినట్లుగా పోలీసులు వివరించారు.
Pregnant Woman Has Narrow Escape As Oxygen Cylinder In Ambulance Explodes in Jalgaon of Maharashtra. pic.twitter.com/PvQPkQZJEY
— Aditya Raj Kaul (@AdityaRajKaul) November 13, 2024