లక్నో: సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ కుమారుడు ప్రతీక్ యాదవ్ తన భార్య అపర్ణా బిస్త్ యాదవ్‌కు విడాకులు ఇవ్వనున్నారు. బీజేపీ నేత అయిన అపర్ణ బిస్త్ తమ కుటుంబాన్ని నాశనం చేస్తున్నట్లు ప్రతీక్ యాదవ్ ఆరోపించారు. వీలైనంత త్వరగా విడాకులు తీసుకోనున్నట్లు చెప్పారు. అపర్ణ యాదవ్ ప్రస్తుతం యూపీ మహిళా కమీషన్లో వైస్ చైర్‌పర్సన్‌గా ఉన్నారు. తన ఇన్‌స్టా అకౌంట్లో ప్రతీక్ యాదవ్ ఓ పోస్టు చేశారు. అపర్ణ యాదవ్ వ్యక్తిగతంగా ప్రవర్తిస్తూ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేస్తున్నదని, ఆమె గొప్పతనం గురించే ఆమె ఆలోచిస్తున్నట్లు ఆరోపించారు. స్వార్థపరురాలైన అపర్ణ యాదవ్‌కు విడాకులు ఇవ్వనున్నట్లు ప్రతీక్ తెలిపారు.
ప్రస్తుతం తన మానసిక పరిస్థితి సరిగా లేదన్నారు. దాని గురించి ఆమె ఆలోచించడం లేదన్నారు. ఇలాంటి చెడు వ్యక్తిని నేను ఎప్పుడూ చూడలేదన్నారు. ఆమెను పెళ్లి చేసుకోవడం దురదృష్టంగా భావిస్తున్నట్లు ప్రతీక్ తన ఇన్‌స్టాలో రాశారు. దీనిపై వివరణ కోరేందుకు ప్రయత్నించగా అపర్ణ స్పందించలేదని తెలిసింది. సమాజ్‌వాదీ పార్టీ నేత ములాయం సింగ్ యాదవ్ రెండో భార్య సాధనా యాదవ్ కుమారుడే ప్రతీక్ యాదవ్. ప్రస్తుతం ఎస్పీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ మొదటి భార్య కుమారుడు.
2017 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో అపర్ణ యాదవ్ లక్నో కంటోన్మెంట్ సీటు కోసం ఎస్పీ టికెట్‌పై పోటీ చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి రీటా బహుగుణా జోషి చేతిలో ఆమె ఓడిపోయారు. 2022 మార్చిలో ఆమె బీజేపీలో చేరారు. బహిరంగంగా ఆ పార్టీ తరపున ప్రచారం నిర్వహించారు. సెప్టెంబర్ 2024లో రాష్ట్ర మహిళా కమిషన్ వైస్ చైర్‌పర్సన్‌గా ఆమెను నియమించారు.