Bankipur : బీజేపీ (BJP) జాతీయ అధ్యక్షుడు (National President) నితిన్ నబిన్ (Nitin Nabin) రాజీనామాతో ఖాళీ అయిన బంకీపూర్ (Bankipur) అసెంబ్లీ స్థానం నుంచి జన్ సురాజ్(Jan Suraaj) పార్టీ పోటీ చేస్తుందని ఆ పార్టీ వ్యవస్థాప అధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్ (Prashant Kishore) ప్రకటించారు. బంకీపూర్‌లో బీజేపీని ఓడించే సామర్థ్యం జన్‌సురాజ్ పార్టీకే ఉందని ఆయన ధీమా వ్యక్తంచేశారు. జన్ సురాజ్ పార్టీ 2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి 238 సీట్లలో పోటీ చేసింది. అయితే ఒక్క సీటు కూడా సాధించలేకపోయింది.
అయితే అధికార ఎన్డీయే ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించి ఎన్నికలకు ముందు పథకాల పేరుతో ఒక్కో మహిళకు రూ.10,000 చొప్పున ఇచ్చిందని, ఇదే ఎన్నికల ఫలితాలను దెబ్బతీసిందని ఫలితాల అనంతరం ప్రశాంత్ కిషోర్ విశ్లేషించారు. బీజేపీకి దశాబ్దాలుగా కంచుకోటగా ఉన్న బంకీపూర్ నియోజకర్గం నుంచి గతం అసెంబ్లీ ఎన్నికల్లో నితిన్ నబిన్ పోటీచేసి వరుసగా ఐదోసారి విజయం సాధించారు. ఆర్జేడీపై 50 వేల ఓట్ల ఆధిక్యంలో ఆయన గెలుపొందగా, జన్ సురాజ్ పార్టీ మూడో స్థానంలో నిలించింది.
అయితే నితిన్ నబిన్ గత జనవరిలో బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అనంతరం రాజ్యసభకు ఎన్నిక కావడంతో గత నెలలో బంకీపూర్ నియోజకవర్గానికి ఆయన రాజీనామా చేశారు. దాంతో బంకీపూర్‌లో ఆరు నెలల్లోపు ఉపఎన్నిక జరగాల్సి ఉంది. బంకీపూర్ నియోజకవర్గం నుంచి జన్ సురాజ్ పోటీ చేస్తుందని ప్రకటించిన ప్రశాంత్ కిషోర్.. ఆ నియోజకవర్గం అభ్యర్థిగా పోటీచేసే అవకాశాలపై నేరుగా సమాధానం ఇవ్వలేదు. దీనిపై పార్టీ నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. పార్టీ సంస్థాగత పనులపై దృష్టి సారించేందుకే తాను గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేదని, పార్టీ సమష్టి నిర్ణయానికే తాను కట్టుబడి ఉంటానని అన్నారు.
జన్ సురాజ్ పార్టీ బీహార్ అధ్యక్షుడు మనోజ్ భారతి మాట్లాడుతూ.. నితిన్ నబిన్ జాతీయ అధ్యక్షుడు కావడంతో బంకీపూర్ నియోజకవర్గం ఇప్పుడు వీవీఐపీ సీటుగా మారిందన్నారు. దాంతో బీజేపీ కూడా శక్తివంచన లేకుండా గెలిచేందుకు ప్రయత్నిస్తున్నదని, జన్ సురాజ్ నుంచి గట్టి నేతను నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. గత 20 రోజులుగా నియోజకవర్గ ప్రజలతో మాట్లాడుతున్నామని, ప్రశాంత్ కిషోర్‌ను తమ అభ్యర్థిగా చూడాలని బంకీపూర్ కోరుకుంటున్నట్టు తమ పరిశీలనలో తేలిందని అన్నారు. పార్టీ కార్యనిర్వాహక వర్గం, ప్రశాంత్ కిషోర్ అంగీకరిస్తే ఈసారి పోటీ రసవత్తరంగా ఉంటుందని చెప్పారు.