డెహ్రాడూన్: కేంద్ర హోంమంత్రి అమిత్ షా కుమారుడిగా నమ్మించేందుకు ఒక వ్యక్తి ప్రయత్నించాడు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ జై షా పేరుతో బీజేపీ ఎమ్మెల్యేకు ఫోన్ చేశాడు. పార్టీకి ఫండ్ కోసం రూ.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అనుమానించిన ఆ ఎమ్మెల్యే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. (Posing as Amit Shah’s son) బీజేపీ పాలిత ఉత్తరాఖండ్‌లో ఈ సంఘటన జరిగింది. ఫిబ్రవరి 16న హరిద్వార్‌లోని రాణిపూర్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే ఆదేశ్ చౌహాన్‌కు గుర్తు తెలియని నంబర్ నుంచి ఫోన్ వచ్చింది. అమిత్ షా కుమారుడు జై షాగా పరిచయం చేసుకున్నాడు. పార్టీ నిధికి రూ.5 లక్షలు విరాళం ఇవ్వాలని అడిగాడు. ఆ ఎమ్మెల్యే అనుమానం వ్యక్తం చేయగా డబ్బులు ఇవ్వకపోతే సోషల్ మీడియాలో పరువు తీస్తానని ఆ వ్యక్తి బెదిరించాడు.
కాగా, బీజేపీ ఎమ్మెల్యే ఆదేశ్ చౌహాన్ తన పీఆర్వో ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారు వెంటనే స్పందించారు. మొబైల్ ఫోన్ నంబర్ ద్వారా నిందితుడి ఆచూకీని గుర్తించారు. ఘాజియాబాద్, ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో రైడ్ చేశారు.19 ఏళ్ల ప్రియాంషు పంత్‌ను ఢిల్లీలో, హర్యానాలోని రుద్రపూర్‌లో ఉవేష్ అహ్మద్‌ను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న గౌరవ్ నాథ్ కోసం వెతుకున్నారు.
మరోవైపు నైనిటాల్ ఎమ్మెల్యే సరితా ఆర్య, రుద్రపూర్ ఎమ్మెల్యే శివ్ అరోరాలను మంత్రులుగా చేస్తామని హామీ ఇచ్చి వారి నుంచి కూడా డబ్బులు వసూలు చేయడానికి నిందితులు ప్రయత్నించినట్లు పోలీస్ అధికారి తెలిపారు. లగ్జరీ లైఫ్ కోసం బీజేపీ ఎమ్మెల్యేల నుంచి డబ్బులు డిమాండ్ చేసేందుకు వారు ప్లాన్ వేసినట్లు వెల్లడించారు.