మహారాష్ట్ర రాజకీయాలు సీఎం ఉద్ధవ్ థాకరే ఆరోగ్యం చుట్టూనే తిరుగుతున్నాయి. 45 రోజులుగా ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఏ కార్యక్రమంలో కూడా కనిపిచడం లేదు. దీంతో ఆయన ఆరోగ్యం చుట్టూనే రాజకీయాలు తిరుగుతున్నాయి. నిజానికి సీఎం ఉద్ధవ్‌కు వెన్నెముక ఆపరేషన్ జరిగింది. దీంతో గత మూడు వారాలుగా ఆయన ఆస్పత్రిలోనే ఉన్నారు. 45 రోజులుగా ఏ పబ్లిక్ మీటింగ్‌లోనూ కనిపించడం లేదు. ఈ విషయంపై ప్రతిపక్ష బీజేపీ తీవ్రంగా స్పందించింది. బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ మాట్లాడుతూ.. సీఎం ఆరోగ్యం మెరుగుపడేంత వరకూ ఆయనకు నమ్మకస్తుడైన వ్యక్తిని సీఎం పదవిలో కూర్చోబెట్టాలని డిమాండ్ చేశారు.
”అసెంబ్లీ సమావేశాలకు ముఖ్యమంత్రి హాజరు కావడం కుదరకపోతే.. ఇతరులకు ఆ బాధ్యత అప్పజెప్పాలి. ఇతరకు ఆ బాధ్యత అప్పజెప్పడం శ్రేయస్కరం కదా. కానీ.. మొత్తానికే గైర్హాజరు కావడాన్ని మేం మాత్రం అంగీకరించే ప్రసక్తే లేదు” అని చంద్రకాంత్ పాటిల్ స్పష్టం చేస్తున్నారు. అయితే ఈ వివాదం ముదరడంతో సీఎం తనయుడు, మంత్రి ఆదిత్య థాకరే స్పందించారు. ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఆరోగ్యం బాగానే ఉందని, ఇబ్బందులేమీ లేవని స్పష్టం చేశారు. కొన్ని రోజుల క్రితమే ఆయన ఓ ముఖ్య సమావేశంలో కూడా పాల్గొన్నారని ఆదిత్య ప్రకటించారు.
వాకబు చేసిన ప్రధాని మోదీ
ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఆరోగ్య పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోదీ వాకబు చేశారు. శివసేన ఎంపీ వినాయక్ రౌత్ ను అడిగి తెలుసుకున్నారు. ఈ విషయాన్ని వినాయక్ రౌత్ వెల్లడించారు. ముఖ్యమంత్రి థాకరే ఆరోగ్య పరిస్థితిపై ప్రధాని వాకబు చేశారని, ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారని, అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారని తాను తెలిపానని వినాయక్ రౌత్ మీడియాతో పేర్కొన్నారు.