అహ్మదాబాద్, మే 7: మహాత్ముడి స్వస్థలం పోర్బందర్కు కూతవేటు దూరంలో వారి పల్లె ఉంటుంది. సముద్రాన్ని నమ్ముకొని బతుకుతున్న పేద ముస్లిం మత్స్యకారులు వాళ్లు. అయితే ఉన్నట్టుండి ఓ కఠిన నిర్ణయాన్ని తీసుకున్నారు. తమకు కారుణ్య మరణాన్ని ప్రసాదించాలని ఏకంగా గుజరాత్ హైకోర్టుకే మొర పెట్టుకున్నారు. ఒకరు, ఇద్దరు కాదు.. ఏకంగా 600 మంది మత్స్యకారులు స్వచ్ఛంద మరణాన్ని ప్రసాదించాలని విజ్ఞప్తి చేశారు. ఎందుకో తెలుసా? కన్నబిడ్డలా సాకాల్సిన ప్రభుత్వమే తమపై శీతకన్ను వేసిందన్న బాధతో.. ప్రధాని మోదీ స్వరాష్ట్రం, బీజేపీ అధికారంలోని గుజరాత్ ఇందుకు వేదికైంది.
కుటుంబాల్ని పోషించలేక..
గుజరాత్లోని గొసబరా చిత్తడినేలల్లో ముస్లిం మత్స్యకార కుటుంబాలు వంద వరకు నివసిస్తున్నాయి. చేపల వేటే జీవనాధారం. తీరప్రాంతంలో పడవలు నిలిపేందుకు, చేపల వేటకు లైసెన్సులు ఉన్నప్పటికీ ప్రభుత్వం అనుమతించడంలేదని గొసబరా ముస్లిం మత్స్యకార సొసైటీ సభ్యులు ఆరోపిస్తున్నారు. మిగతా వర్గాల వారికి ఆంక్షలు లేవని, కేవలం తమపై మాత్రమే నిషేధం విధించారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2016 నుంచి ఈ పక్షపాతం ఎక్కువైందని, ఇటీవల రాజకీయ వేధింపులు కూడా తోడయ్యాయని ఇస్మాయిల్భాయ్ అనే వ్యక్తి తెలిపారు. అధికార నేతలతో పాటు గవర్నర్ వరకూ తమ బాధను తీసుకెళ్లామని..ఫలితం లేకుండా పోయిందని వాపోయారు. కుటుంబాల్ని పోషించలేని స్థితికి వచ్చామని.. దీంతో కారుణ్య మరణానికి నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. గుజరాత్ ప్రభుత్వం ముస్లింలను వేరుగా చూస్తున్నదని అన్నారు.