షిల్లాంగ్: జూనియర్ అధికారి అయిన కల్నల్ భార్యను ఆర్మీ బ్రిగేడియర్ పలుమార్లు లైంగికంగా వేధించాడు. (Army Brigadier Harases Colonel’s Wife) అతడి టార్చర్ భరించలేని బాధిత మహిళ చివరకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఆర్మీ బ్రిగేడియర్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌లో ఈ సంఘటన జరిగింది. ఆర్మీలో కల్నల్ ర్యాంకు అధికారి భార్య మార్చి 10న షిల్లాంగ్‌లోని పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. ఆర్మీ బ్రిగేడియర్ తనను లైంగికంగా వేధిస్తున్నట్లు ఫిర్యాదు చేసింది. పలుమార్లు అనుచితంగా ప్రవర్తించడం, తాకడంతోపాటు అసభ్యకరంగా మాట్లాడినట్లు ఆరోపించింది.
కాగా, మార్చి 8న ఆఫీసర్స్ మెస్‌లో జరిగిన ఒక ఫంక్షన్ సందర్భంగా ఆర్మీ బ్రిగేడియర్ తన పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడంతోపాటు అసభ్యకరంగా ప్రవర్తించినట్లు కల్నల్ భార్య ఆ ఫిర్యాదులో పేర్కొంది. అతడి తీరు మితిమీరడంతో చివరకు తన భర్త జోక్యం చేసుకున్నట్లు ఆమె తెలిపింది.
మరోవైపు గత ఏడాది ఏప్రిల్ 13న ఒక అధికారి గృహ ప్రవేశం సందర్భంగా కూడా ఆ బ్రిగేడియర్ తన డ్రెస్ పట్ల కామెంట్లు చేశాడని, రెండు నెలల తర్వాత తన ఇంట్లో డిన్నర్ సందర్భంగా భర్త ఎదుటే తన చేతిని పట్టుకున్నాడని ఆ మహిళ ఆరోపించింది. తమ ఇంటి పక్కనే నివసించే బ్రిగేడియర్ ప్రవర్తన, తీరు పట్ల తీవ్ర మనస్తాపం చెందినట్లు ఆమె వాపోయింది. ఆయన వల్ల తన ప్రాణానికి ముప్పు ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.
కాగా, కల్నల్ భార్య ఫిర్యాదుపై మేఘాలయా పోలీసులు స్పందించారు. లైంగిక వేధింపులు, మహిళను అవమానించడం, బెదిరింపులకు పాల్పడటం వంటి సెక్షన్ల కింద ఆర్మీ బ్రిగేడియర్‌పై కేసు నమోదు చేశారు. అయితే ఈ ఆరోపణలపై ఆర్మీ ఇంకా స్పందించలేదు.