లక్నో: బ్యాంకు రుణాలు ఎగ్గొట్టేందుకు కొందరు మహిళలు ప్రయత్నించారు. తమ భర్తలు మరణించినట్లుగా నకిలీ డెత్ సర్టిఫికెట్లు సమర్పించారు. (faking husbands’ death) అయితే ఆ మహిళల భర్తలు బతికే ఉన్నట్లు బ్యాంకు సిబ్బంది తెలుసుకున్నారు. ఈ మోసంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో నలుగురు మహిళలను అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల్లోని మహిళలు స్వయం ఉపాధి పొందేందుకు ఒక బ్యాంకు రుణాలు మంజూరు చేసింది. నిబంధనల ప్రకారం లబ్ధిదారుని భర్త చనిపోతే మిగిలిన రుణ వాయిదాలు మాఫీ చేస్తారు. అలాగే గతంలో చెల్లించిన వాయిదాల మొత్తాన్ని తిరిగి ఇస్తారు.
కాగా, ఈ నిబంధన సాకుతో బ్యాంకు రుణాలు ఎగ్గొట్టేందుకు నలుగురు మహిళలు ప్రయత్నించారు. తమ భర్తలు మరణించినట్లుగా నకిలీ మరణ ధృవీకరణ పత్రాలను బ్యాంకుకు సమర్పించారు. రుణ వాయిదాలను మాఫీ చేయాలని, చెల్లించిన వాయిదాల డబ్బును తిరిగి ఇవ్వాలని కోరారు.
మరోవైపు ఆ మహిళల భర్తలు బతికే ఉన్నట్లు బ్యాంకు సిబ్బంది దర్యాప్తులో తెలిసింది. దీంతో మోసానికి యత్నించిన ఆ మహిళలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల పరిశీలనలో కూడా వారి భర్తలు బతికే ఉన్నట్లు తేలింది. ఈ నేపథ్యంలో నలుగురు మహిళలను అరెస్ట్ చేశారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
కాగా, నకిలీ సర్టిఫికెట్లను ఎవరు, ఎలా తయారు చేశారు అన్న దానిపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా ఎవరైన మహిళలు ఇలాంటి మోసానికి పాల్పడ్డారా అన్నది ఆరా తీస్తున్నారు.