న్యూఢిల్లీ/ఇస్లామాబాద్: పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) విదేశీ భూభాగమని (POK foreign territory) పాకిస్థాన్ అంగీకరించింది. ఆ దేశంలోని హైకోర్టుకు ఈ విషయాన్ని స్పష్టం చేసింది. పీవోకేకు చెందిన కవి, జర్నలిస్ట్ అహ్మద్ ఫర్హాద్ షా కిడ్నాప్ కేసులో కోర్టుకు ఈ మేరకు తెలిపింది. అహ్మద్ ఫర్హాద్ షా పలు నిరసనల్లో పాల్గొన్నారు. పీవోకేపై పాకిస్థాన్ ప్రభుత్వం పెత్తనం, ఆ దేశ ఆర్మీ మోహరింపునకు వ్యతిరేకంగా పలు ఉద్యమాల్లో ఆయన గళమెత్తారు. ఈ నేపథ్యంలో ఆయనపై కేసులు కావడంతో మే 15న ఇంటి నుంచి ధీర్కోట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కాగా, పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ తన భర్తను కిడ్నాప్ చేసిందని అహ్మద్ ఫర్హాద్ షా భార్య ఆరోపించింది. ఇస్లామాబాద్ హైకోర్టును ఆమె ఆశ్రయించింది. దీంతో ఫర్హాద్ షాను కోర్టులో ప్రవేశపెట్టాలని న్యాయమూర్తి మొహ్సిన్ అక్తర్ కయానీ ఆదేశించారు.
Kashmiri Poet Ahmed Farhad
మరోవైపు పాకిస్థాన్ అదనపు అటార్నీ జనరల్ శుక్రవారం ప్రభుత్వం తరుఫున కోర్టులో వాదించారు. పీవోకేలోని పోలీస్ కస్టడీలో ఫర్హాద్ షా ఉన్నట్లు కోర్టుకు తెలిపారు. సొంత రాజ్యాంగం, సొంత కోర్టులున్న పీవోకే విదేశీ భూభాగమని చెప్పారు. దీనిపై పాకిస్థాన్‌కు ఎలాంటి అధికార పరిధి లేదని ఆయన అన్నారు. పీవోకేలోని పాకిస్థాన్ కోర్టుల తీర్పులను విదేశీ కోర్టుల తీర్పులుగా పరిగణిస్తారని అన్నారు. ఈ నేపథ్యంలో అహ్మద్ ఫర్హాద్ షాను ఇస్లామాబాద్ హైకోర్టు ముందు హాజరు పరచలేమని కోర్టుకు వెల్లడించారు.
కాగా, పాకిస్థాన్ అదనపు అటార్నీ జనరల్ వాదనలపై ఇస్లామాబాద్ హైకోర్టు న్యాయమూర్తి మొహ్సిన్ అక్తర్ కయానీ మండిపడ్డారు. పీవోకే విదేశీ భూభాగమైతే పాకిస్థాన్ సైన్యం, పాకిస్థానీ రేంజర్లు ఆ భూమిలోకి ఎలా ప్రవేశించారని ఆయన ప్రశ్నించారు. పాకిస్థాన్ గూఢచార సంస్థలు పీవోకే ప్రజలను బలవంతంగా అపహరించే పద్ధతిని కొనసాగిస్తున్నాయని న్యాయమూర్తి కయానీ విమర్శించినట్లు పాక్ మీడియా సంస్థలు పేర్కొన్నాయి. అయితే పీవోకే తమ అంతర్భాగమని ఎప్పటి నుంచో భారత్ చెబుతోంది.