న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ ఈ నెల 29 నుంచి 31వ తేదీ వరకు మూడు రోజులపాటు ఇటలీ రాజధాని రోమ్ నగరంలో ఉంటారని భారత విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్ స్రింగ్లా తెలిపారు. జీ-20 సదస్సులో పాల్గొనేందుకు రావాలన్న ఇటలీ ప్రధాని మరియో డ్రాంఘీ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ అక్కడికి వెళ్తున్నారని చెప్పారు. ఇది ప్రధాని నరేంద్రమోదీ హాజరుకాబోతున్న 8వ జీ-20 సదస్సు అని వెల్లడించారు.
గత ఏడాది సౌదీ అరేబియా ఆతిథ్యంలో జరిగిన జీ-20 సదస్సును కరోనా మహమ్మారి కారణంగా వర్చువల్ పద్ధతిలో నిర్వహించారని హర్షవర్దన్ స్రింగ్లా తెలిపారు. ఇది మొత్తానికి 16వ జీ-20 సదస్సు అని, ప్రధాని మోదీ హాజరుకాబోతున్న 8వ సదస్సు అని చెప్పారు. జీ-20 సదస్సు అనంతరం ప్రధాని మోదీ వివిధ దేశాధినేతలతో సమావేశమవుతారని వెల్లడించారు. ఆ తర్వాత గ్లాస్గోలో జరిగే కాప్-26 సదస్సులో ప్రధాని పాల్గొంటారన్నారు.