న్యూఢిల్లీ : ప్రధాని మోదీతో జమ్మూకశ్మీర్‌కు చెందిన నేతలు ఇవాళ సమావేశం అయ్యారు. ఢిల్లీలోని ప్రధాని నివాసంలో ఈ భేటీ జరుగుతున్నది. కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత ఈ భేటీ జరగడం విశేషం. జమ్మూకశ్మీర్‌లో రాజకీయ సుస్థిరతను తీసుకురావాలన్న ఉద్దేశంతో సమావేశం నిర్వహించినట్లు తెలుస్తోంది. ఆ రాష్ట్రానికి చెందిన నలుగురు మాజీ సీఎంలతో పాటు మొత్తం 14 మంది నేతలు మీటింగ్‌కు హాజరయ్యారు. ప్రధాని మోదీతో పాటు హోంశాఖ మంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా పాల్గొన్నారు. మాజీ సీఎంలు ఫారూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ, గులాం నబీ ఆజాద్‌లు ఓపెన్ మైండ్‌తో మీటింగ్‌కు హాజరైనట్లు తెలిపారు.
జమ్మూకశ్మీర్ రెండు రాష్ట్రాలుగా విడిపోయిన నేపథ్యంలో.. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కొత్త నియోజకవర్గాల ఏర్పాటు కోసం డీలిమిటేషన్ చేపట్టాలన్న ఆలోచనలు నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. కశ్మీర్‌కు రాష్ట్ర హోదాను తిరిగి ఇచ్చేందుకు కేంద్రం సానుకూలంగా ఉన్నా.. అది ఎప్పుడన్న విషయం ఇంకా అస్పష్టంగానే ఉంది. ప్రధాని ముందు తన డిమాండ్లను ఉంచిన తర్వాత మీడియాతో మాట్లాడనున్నట్లు ఫారూక్ అబ్దుల్లా తెలిపారు. మహమ్మారి కరోనా నేపథ్యంలో ఉగ్రవాదం అదుపులో ఉందని, ఈ సందర్భంగా రాజకీయ ప్రక్రియను మొదలుపెట్టాలని భావిస్తున్నట్లు ఇటీవల కేంద్ర హోంశాఖ చెప్పింది.