లక్నో: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో గంగానది ప్రవాహం ఉధృతంగా మారింది. ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో గంగానది నీటిమట్టం గురువారం ఉదయం ప్రమాదకర స్థాయిని (71.28 మీటర్లు) దాటినట్టు సీడబ్ల్యూసీ (కేంద్ర జల సంఘం) ప్రకటించింది.
దీంతో జిల్లా కలెక్టర్ సత్యేంద్రకుమార్తో ఫోన్లో మాట్లాడిన ప్రధాని మోదీ, వారణాసిలో వరద పరిస్థితిపై ఆరా తీశారు. వరద బాధితుల కోసం చేసిన ఏర్పాట్లు, సహాయక చర్యలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధితులకు సహాయం చేసేందుకు యుద్ధ ప్రాతిపదికన పనిచేయాలని, అవసరమైన అన్ని సదుపాయాలనూ తక్షణమే కల్పించాలని జిల్లా యంత్రాంగాన్ని ప్రధాని ఆదేశించారు.