పాట్నా: ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ బీహార్‌లోని దర్బంగాలో ఎయిమ్స్(AIIMS Darbhanga) వైద్యశాలకు శంకుస్థాపన చేశారు. సుమారు 12 వేల కోట్ల ఖరీదైన ప్రాజెక్టులను ఆయన ప్రారంభించారు. ప్రజల సంక్షేమానికి ఎన్డీఏ సర్కారు కట్టుబడి ఉన్నట్లు ఆయన చెప్పారు. దర్బంగా ఎయిమ్స్ వల్ల స్థానిక ప్రజల ఆరోగ్య విషయాల్లో పెను మార్పు రానున్నట్లు ఆయన వెల్లడించారు. పొరుగు దేశమైన నేపాల్ నుంచి కూడా వైద్య చికిత్సకు జనం రానున్నట్లు ఆయన తెలిపారు.
బీహార్‌లో ఎంతో అభివృద్ధి జరుగుతోందని ప్రధాని అన్నారు. గత ప్రభుత్వాలు బీహార్ ప్రజలు ఆరోగ్యం గురించి ఆలోచించలేదని, ఆరోగ్య మౌళికసదుపాయాల్ని కల్పించలేకపోయినట్లు చెప్పారు. గతంలో ప్రభుత్వాలు తప్పుడు వాగ్దానాలు చేశాయని, కానీ నితీశ్ కుమార్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పరిస్థితి మెరుగైందన్నారు. ఆర్థికంగా బలహీనంగా ఉన్న వారి కోసం దేశవ్యాప్తంగా 1.5 లక్షల ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ప్రధాని మోదీ తెలిపారు. తమ ప్రభుత్వం దేశవ్యాప్తంగా లక్ష మెడికల్ సీట్లను కల్పించిందని, మరో 75వేల మెడికల్ సీట్లను సృష్టించనున్నట్లు ప్రధాని మోదీ వెల్లడించారు.
నితీశ్ కుమార్ ప్రభుత్వం సుపరిపాలన అందిస్తోందని, రాష్ట్రంలో ఉన్న జంగిల్ రాజ్‌ను తొలగించినట్లు ఆయన తెలిపారు. వరద సమస్యలను దూరం చేసేందుకు బీహార్‌లో ఎన్డీఏ సర్కారు సుమారు 11 వేల కోట్ల ప్రాజెక్టులను అమలు చేస్తోందన్నారు.