న్యూఢిల్లీ: ఇంధనం వినియోగాన్ని తగ్గించుకోవాలని ప్రధాని మోదీ ఇటీవల పేర్కొన్న విషయం తెలిసిందే. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పొదుపు చర్యలు పాటించాలని ఆయన కోరారు. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోదీ కాన్వాయ్(PM Modi Convoy)లో ఉండే వాహనాల సంఖ్యను తగ్గించారు. ఇంధనాన్ని ఆదా చేయాలన్న ఉద్దేశంతో ఆ చర్య తీసుకున్నారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఇదే విధానాన్ని ఫాలోకావాలని కూడా ప్రభుత్వ వర్గాలు సూచించాయి. గత ఆదివారం హైదరాబాద్లో జరిగిన ఓ సభలో మాట్లాడుతూ ప్రధాని మోదీ కొన్ని పొదుపు చర్యల గురించి వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాత చేపట్టిన గుజరాత్, అస్సాం పర్యటనల్లో ప్రధాని మోదీ కాన్వాయ్ సామర్థ్యం తగ్గినట్లు తెలిసింది. విదేశీ మారకం నిల్వలను పెంచుకోవాలన్న ఉద్దేశంతో ప్రధాని మోదీ పలు రాకల పొదుపు సూచనలు చేశారు.
ప్రధాని మోదీ సెక్యూర్టీలో ఎటువంటి తరుగుదల లేదని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. సెక్యూర్టీ ఏర్పాట్లతో పాటు ఎస్పీజీ ప్రోటోకాల్స్ అన్ని పూర్తి స్థాయిలో ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కానీ భద్రతకు సంబంధించిన వాహనాల సంఖ్యను మాత్రం తగ్గించినట్లు వెల్లడించారు. అస్సాం సీఎంగా హిమంత ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో.. ప్రధాని మోదీ ప్రసంగానికి చెందిన కాపీలను పీఎంవో అక్కడికి హాజరైన ముఖ్యమంత్రులకు అందజేసింది. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో ఆ పొదుపు చర్యలను చేపట్టాలని పీఎంవో కోరింది. ఎలక్ట్రానిక్ వాహనాల సంఖ్యను పెంచాలని ప్రభుత్వం తన కార్యాచరణలో భాగంగా కోరింది. వర్చువల్ మీటింగ్లపై ఆధారపడాలని పేర్కొన్నది.
ప్రధాని మోదీ సూచన తర్వాత అనేక మంది ముఖ్యమంత్రులు తమ కాన్వాయ్ సంఖ్యను తగ్గించినట్లు తెలుస్తోంది.