లావోస్: ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న యుద్ధ, రాజకీయ సంక్షోభాల వల్ల.. దక్షిణాసియా దేశాలపై తీవ్ర ప్రభావం పడుతున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) అన్నారు. యురేసియా, వెస్ట్ ఏషియా దేశాల్లో శాంతి, స్థిరత్వం నెలకొనాలని ఆయన ఆశించారు. లావోస్‌లో జరుగుతున్న 19వ ఈస్ట్ ఏసియా సమ్మిట్‌లో పాల్గొని ఆయన మాట్లాడారు. యుద్ధ క్షేత్రాల నుంచి సమస్యలకు పరిష్కారాలు దొరకవన్నారు. దక్షిణాసియా ప్రాంతంలో చైనా ప్రాబల్యాన్ని గురించి ప్రస్తావిస్తూ.. స్వేచ్ఛాయుత ఇండో పసిఫిక్ విధానాల వల్ల ఈ ప్రాంతంలో శాంతి నెలకొంటుందన్నారు.
దక్షిణ చైనా సముద్రంలో శాంతి, భద్రత, స్థిరత్వం వల్లే.. ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతి ఉంటుందన్నారు. సముద్ర కార్యకలాపాలన్నీ యూఎన్సీఎల్వోఎస్ కు అనుగుణంగా జరగాలని ఆయన కోరారు. నావిగేషన్, ఎయిర్‌స్పేస్‌పై స్వేచ్ఛ ఉండాలన్నారు. ప్రాంతీయ దేశాల విదేశీ విధానాలపై ఆంక్షలు ఉండవద్దు అన్నారు. అభివృద్ధిపై దృష్టి పెట్టాలని, కానీ విస్తరణపై కాదన్నారు. యుద్ధాలు జరుగుతున్న దేశాల వల్ల .. గ్లోబల్ సౌత్ ప్రాంతంపై ప్రభావం పడుతోందన్నారు. బుద్ధుడి పుట్టిన దేశం నుంచి వచ్చానని, యుద్ధాలు చేసే యుగం ఇది కాదన్నారు.