omicron : ఆఫ్రికా దక్షిణ దేశాల్లో బయటపడి ప్రపంచదేశాలను గడగడలాడిస్తున్న కొత్త రకం కరోనా ఒమిక్రాన్ విస్తృతిపైన, దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియపైన ప్రధాని నరేంద్రమోదీ ( PM Modi ) ఈ ఉదయం ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ( omicron ) గురించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆ న్యూ వేరియంట్‌ను దేశంలోకి రాకుండా కట్టడిచేసే విషయంలో చాలాసేపు చర్చించారు. అదేవిధంగా అధికారులకు కొన్ని సలహాలు, సూచనలు ఇచ్చారు.
కరోనా కొత్త వేరియంట్ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేయాలని అధికారులకు ప్రధాని మోదీ సూచించారు. అన్ని రాష్ట్రాల్లోనూ జిల్లా స్థాయిలో కరోనా న్యూ వేరియంట్‌పై అవగాహన కల్పించాలన్నారు. అదేవిధంగా కరోనా కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రజలు నిబంధనలు పాటించేలా తీవ్రమైన నిరోధం, నిరంతర నిఘాను కొనసాగించాలని ప్రధాని ఆదేశించారు. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు నిబంధనల మేరకు పరీక్షలు చేయించుకున్నారా లేదా అనే విషయంలో గట్టి పర్యవేక్షణ అవసరమని చెప్పారు. కరోనా ఉధృతంగా ఉన్న దేశాలపై ప్రధానంగా దృష్టి సారించాలన్నారు.
కొత్త వేరియంట్ కలకలం రేపుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ ప్రయాణాలను సులభతరం చేయడానికి సంబంధించి రూపొందించిన ప్రణాళికలపై అధికారులు పునరాలోచన చేయాలని ప్రధాని మోదీ ఆదేశించారు.