న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం కీలక బిల్లులను ఇవాళ పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నది. అయితే రాజకీయాల్లో నేరరహితం చేసేందుకు సంచలన నిర్ణయం తీసుకున్నది. రాజ్యాంగ సవరణ బిల్లుల(Constitution Amendment Bill)ను ప్రవేశపెట్టనున్నారు. ఒకవేళ ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, రాష్ట్ర మంత్రులు ఎవరైనా ఏదైనా కేసులో అరెస్టు అయితే, వాళ్లు 30 రోజుల పాటు జైలు జీవితం అనుభవిస్తే, అప్పుడు వాళ్లు పదవులు కోల్పోయే అవకాశం ఉన్నది. ఈ రకమైన మార్పులతో కొత్త చట్టాన్ని తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్దమైంది. అయితే ఆయా నేరాల్లో సదరు వ్యక్తికి కనీసం అయిదేళ్ల జైలుశిక్ష లేదా అంతకన్నా ఎక్కువ శిక్ష పడాల్సి ఉంటుంది.
రాజ్యాంగ(113వ సవరణ) బిల్లు 2025ని ఇవాళ సభలో ప్రవేశపెట్టనున్నారు. ఆర్టికల్ 75, 164, 239ఏఏను సవరించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. ఒకవేళ ఆ బిల్లుకు ఆమోదం దక్కితే, అప్పుడు నేరం చేసిన ప్రధాని అయినా లేక కేంద్ర మంత్రులైనా, లేక సీఎంలు, రాష్ట్ర మంత్రులెవరైనా తమ పదవులను కోల్పోవాల్సి ఉంటుంది.
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ బిల్లులను ప్రవేశపెట్టనున్నారు. ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ .. లిక్కర్ స్కాంలో అరెస్టు అయి తీహార్ జైలులో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఆయన జైలులో ఉన్నా కూడా తన సీఎం పదవిని వదులుకునేందుకు నిరాకరించారు. ఈ నేపథ్యంలో రాజ్యాంగ సవరణ బిల్లును తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది. ఇవాళ పాసయ్యే బిల్లులను పార్లమెంట్ సంయుక్త కమిటీకి పంపనున్నారు. అయితే జైలు నుంచి రిలీజైన తర్వాత మాత్రం పీఎం, సీఎం, మంత్రులెవరైనా.. మళ్లీ రీ అపాయింట్ కావొచ్చు అని బిల్లులో ఉన్నట్లు తెలుస్తోంది.