IIT Placements | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, జూలై 10 (నమస్తే తెలంగాణ): దేశంలోనే ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలైన ఐఐటీల్లోనూ కొలువుల సంక్షోభం, వేతనాల కోత కొనసాగుతున్నది. ఒకప్పుడు ఏడాదికి సగటున రూ. 25 లక్షల నుంచి రూ. 30 లక్షల ప్యాకేజీతో ఉద్యోగావకాశాలను అందిపుచ్చుకొన్న ఐఐటీయన్లకు ఇప్పుడు వేతనం రూ. 15 లక్షలు దాటడమే కష్టంగా మారింది.
ఈ మేరకు డెలాయిట్, టీమ్‌లీజ్ సంస్థలు వేర్వేరుగా చేసిన సర్వేల్లో బయటపడింది. పురాతన ఏడు ఐఐటీల్లో కిందటేడాది సగటు వేతన ప్యాకేజీ రూ. 18 లక్షలు-రూ. 20 లక్షలుగా ఉంటే, ప్రస్తుతం ఇది రూ. 15 లక్షలకు తగ్గిందని వెల్లడైంది. కొత్త ఐఐటీల్లో ఇది రూ. 12 లక్షలకే పరిమితమైనట్టు తేలింది. దేశంలో టాప్ ఇంజినీరింగ్ కాలేజీల్లోనూ వేతనాలు ఆశాజనకంగా లేవని నివేదికలు తెలిపాయి.
ఉద్యోగాలూ కష్టమే
ఐఐటీల్లో చదివినవారిలో దాదాపు 40 శాతం మందికి క్యాంపస్ ప్లేస్మెంట్లలో ఉద్యోగాలు లభించడం లేదని ఉద్యోగాల కల్పన సేవలు అందించే ఆఫీస్ ఆఫ్ కెరీర్ సర్వీసెస్(ఓసీఎస్) తాజా నివేదికలో వెల్లడించింది. ఉద్యోగాలు వచ్చినవారిలోనూ చాలామందికి రూ.10 లక్షల లోపే వార్షిక వేతనం ఉన్నట్టు వివరించింది. దాదాపు 1,800 మంది ఐఐటీ-ఢిల్లీ విద్యార్థులు ఉద్యోగాల కోసం నమోదు చేసుకుంటే 1,083 మందికే కొలువులు లభించినట్టు నివేదిక గుర్తు చేసింది. అంటే దాదాపు 40 శాతం మందికి ఉద్యోగాలు దొరకలేదని తెలిపింది. గత ఐదేండ్లలో ఐఐటీలో చదువులు పూర్తిచేసిన దాదాపు 22 శాతం మంది విద్యార్థులకు ఇప్పటికీ ఉద్యోగాలు దొరకలేదని ఓ ఆర్టీఐ దరఖాస్తు ద్వారా వెల్లడైంది.

కారణాలు ఇవే
ప్రపంచవ్యాప్తంగా ఆర్థికమందగమనం, పశ్చిమ దేశాల్లో నెలకొన్న ఐటీ సంక్షోభం, ఐటీని కాదని తయారీ, ఎలక్ట్రికల్ వెహికిల్ (ఈవీ) తదితర రంగాల్లో పెట్టుబడులు పోటెత్తడం.. వెరసి ఐటీ ఉద్యోగాల్లో కోతలతో పాటు ప్యాకేజీల్లో తగ్గుదల నమోదవుతున్నట్టు టీమ్‌లీజ్ సీఈవో రమేశ్ అల్లూరీ రెడ్డి తెలిపారు.