అమ్రేలీ: గుజరాత్లోని అమ్రేలీ జిల్లాలో విమాన ప్రమాదం(Aircraft Crash) జరిగింది. ఈ దుర్ఘటనలో శిక్షణ పొందుతున్న ట్రైనీ పైలెట్ ప్రాణాలు కోల్పోయాడు. ప్రైవేట్ ఏవియేషన్ అకాడమీకి చెందిన శిక్షణ విమానం ఇవాళ మధ్యాహ్నం ప్రమాదానికి గురైంది. ఓ రెసిడెన్షియల్ ఏరియాపై ఆ శిక్షణ విమానం కూలింది. దీంతో మంటలు వ్యాపించాయి. ఓ చెట్టుపై విమానం కూలింది. ఆ తర్వాత ఓపెన్ ప్లాట్లోకి దూసుకెళ్లింది.
అమ్రేలీ పట్టణంలోని గిరియా రోడ్డు ప్రాంతంలో ఉన్న రెసిడెన్షియల్ ఏరియాలో ఎయిర్క్రాఫ్ట్ ప్రమాదానికి లోనైంది. మధ్యాహ్నం 12.30 నిమిషాలకు ప్రమాదం జరిగింది. కారణాలు ఇంకా తెలియరాలేదు. స్పాట్లోనే ట్రైనీ పైలెట్ చనిపోయినట్లు అమ్రేలీ ఎస్పీ సంజయ్ ఖారత్ తెలిపారు. పైలట్ ఒంటరిగా విమానం నడుపుతున్నట్లు తెలిసింది. అమ్రేలీ విమానాశ్రయం నుంచి ఆ ఎయిర్క్రాఫ్ట్ టేకాఫ్ తీసుకున్నది.
అమ్రేలీ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి చెందిన ఏవియేషన్ అకాడమీ పైలట్లకు శిక్షణ ఇస్తోంది. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు. విమాన ప్రమాదం గురించి తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటల్ని ఆర్పారు. రెసిడెన్షియల్ ప్రాంతంలో విమానం కూలినా.. అక్కడ ఎవరికీ గాయాలు కాలేదు.