న్యూఢిల్లీ, మే 5: న్యాయస్థానాల్లో న్యాయం కోరుతూ దాఖలు చేసే ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు(పిల్) దుర్వినియోగం అవుతుండటం పట్ల సుప్రీం కోర్టు మంగళవారం ఆందోళన వ్యక్తం చేసింది. ప్రజాప్రయోజన వ్యాజ్యాలు కాస్తా వ్యక్తిగత ప్రయోజన వ్యాజ్యం, ప్రజా ప్రయోజన వ్యాజ్యం, డబ్బు ప్రయోజన వ్యాజ్యం, రాజకీయ ప్రయోజన వ్యాజ్యాలుగా మారిపోతున్నాయని వ్యాఖ్యానించింది.
కేరళలోని శబరిమల ఆలయం సహా దేశంలోని వివిధ ఆలయాల్లో మహిళల పట్ల చూపుతున్న వివక్ష, అలాగే వివిధ మతాల పరిధిలో మత స్వేచ్ఛ విస్తృతిపై దాఖలైన పలు పిటిషన్లను విచారించిన తొమ్మిది మంది న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం.. 10 నుంచి 50 ఏండ్ల మహిళలకు శబరిమల ఆలయ ప్రవేశాన్ని నిషేధించడాన్ని ఇండియన్ యంగ్ లాయర్స్ అసోసియేషన్ సవాల్ చేయడంలో గల లక్ష్యమేమిటని ప్రశ్నించింది.
2006లో నాలుగు పత్రికల్లో ప్రచురితపైన ఆర్టికల్స్ ఆధారంగా ఈ పిల్‌ను దాఖలు చేసినట్టు ఆ అసోసియేషన్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న న్యాయవాది రవిప్రకాశ్ గుప్తా తెలిపారు. ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని నేరుగా కొట్టివేసి ఉండాల్సిందని వ్యాఖ్యానించిన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్.. కొన్ని పత్రికల్లో వచ్చిన కథనాలు పిల్ దాఖలు చేయడానికి ఎలా కారణమవుతాయని ప్రశ్నించారు. ప్రజలకు అవసరమైన అంశాలపై విచారించడానికి మాత్రమే తాము హైకోర్టు, సుప్రీం కోర్టుల్లో ప్రజాప్రయోజన వ్యాజ్యాలను అంగీకరిస్తామే తప్ప వార్తా పత్రికల కోసం రాసే వ్యాసాల కోసం కాదని జస్టిస్ నాగరత్న అన్నారు.