రష్యా- ఉక్రెయిన్ మధ్య తలెత్తిన పరిస్థితుల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్, అంతర్జాతీయ ఇంధన మార్కెట్లలో వచ్చిన హెచ్చుతగ్గులను నిరంతరం గమనిస్తూనే వున్నామని భారత పెట్రోలియం శాఖ పేర్కొంది. మార్కెట్లలోని హెచ్చు తగ్గుల ప్రభావం ప్రజలపై పడకుండా, ముడి చమురు ధరల పెరుగదల ప్రభావం కూడా ప్రజలపై పడకుండా ఉండేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు.
వ్యూహాత్మక పెట్రోలియం నిల్వలను ఉపయోగించే విషయంపై కూడా ఆలోచిస్తున్నట్లు సంబంధిత అధికారులు పేర్కొన్నారు. స్థిరమైన ధరలే కొనసాగేట్లుగా చూస్తామని, ప్రజలపై ఇంధన భారం పడకుండా ప్రయత్నాలు చేస్తామని పెట్రోలియం శాఖ హామీ ఇచ్చింది. రష్యా ఉక్రెయిన్ సంక్షోభం నేపథ్యంలో పెట్రో ధరలు పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ 100 డాలర్ల పైకి చేరుకుంది. ఈ ప్రభావం మన దేశంలోని ముఖ్య నగరాలపై కూడా పడింది.