న్యూఢిల్లీ, ఏప్రిల్ 28: పెట్రోల్, డీజిల్ లాంటి శిలాజ ఇంధనాలతో నడిచే వాహనాలకు దీర్ఘకాలంలో భవిష్యత్తు ఉండదని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మంగళవారం పేర్కొన్నారు. బస్వరల్డ్ ఇండియా కాంక్లేవ్ 2025లో ప్రత్యామ్నాయ ఇంధనాల ఆవశ్యకతను ఆయన నొక్కి చెబుతూ ఈ మేరకు స్వచ్ఛమైన ఇంధనాల వైపు పరివర్తన చెందేలా కృషి చేయాలని వాహన పరిశ్రమకు విజ్ఞప్తి చేశారు. దీని కారణంగా ప్రజా రవాణా వ్యవస్థ కూడా మెరుగవుతుందని అన్నారు. ‘పెట్రోల్, డీజిల్ వాహనాలకు భవిష్యత్తు లేదు’ అని ఉద్ఘాటించిన ఆయన సీఎన్జీ, ఎల్ఎన్జీ, బయోఫ్యూయల్స్, విద్యుత్ పవర్ట్రైన్ల వంటి స్వచ్ఛమైన ఇంధనాల వైపు పరివర్తన చెందాలన్నారు. ప్రస్తుతం విస్తృతంగా వినియోగిస్తున్న డీజిల్, పెట్రోల్ దిగమతులకు సంబంధించి భవిష్యత్లో సమస్యలు ఎదురుకానున్నాయన్నారు.