ముంబై: ‘మోదీ ఉంటేనే అది సాధ్యం’ అన్న నినాదాన్ని ప్రజలు తిరస్కరించారని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధ్యక్షుడు శరద్ పవార్ (Sharad Pawar) అన్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయంపై ఆయన స్పందించారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రను ప్రశంసించిన ఆయన, ‘మోదీ హైతో ముమ్కిన్ హై’ (మోదీ ఉంటేనే అది సాధ్యం) అన్న దాన్ని ప్రజలు తిరస్కరించారని తెలిపారు. అన్ని వ్యవస్థల్లో ఒక వ్యక్తి హవాను ప్రజలు ఇక ఏ మాత్రం అంగీకరించడం లేదన్నారు. ‘మోదీ లేకపోతేనే అది సాధ్యం’ అన్నది కర్ణాటక ఎన్నికల ఫలితాలతో స్పష్టమైందని అన్నారు.
అధికారంలో ఉన్న బీజేపీ కంటే డబుల్ మెజార్టీతో కాంగ్రెస్‌ను గెలిపించిన కర్ణాటక ప్రజలను శరద్ పవార్ అభినందించారు. బీజేపీ అవినీతి, అధికార దుర్వినియోగానికి వ్యతిరేకంగా ఆ రాష్ట్ర ప్రజలు ఇచ్చిన తీర్పు అని చెప్పారు. కేరళ, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, జార్ఖండ్, పంజాబ్, పశ్చిమ బెంగాల్ వంటి చాలా రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో లేదని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది జరుగనున్న పార్లమెంట్ ఎన్నికల ఫలితాల చిత్రం, కర్ణాటక ఫలితాల ద్వారా మన కళ్లకు కనిపిస్తున్నదని అన్నారు.
కాగా, ఎన్నికైన ప్రభుత్వాలను కూలగొట్టేందుకు బీజేపీ అనుసరిస్తున్న సరికొత్త పద్ధతిపై శరద్ పవార్ ఆందోళన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలను చీల్చి మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గోవా, కర్ణాటకలో ప్రభుత్వాలను కూల్చారని దుయ్యబట్టారు. ‘ఇటీవల కాలంలో ఎమ్మెల్యేలను చీల్చి, రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. అందుకు తన అధికార ఫార్ములాను ఆయన ( మోదీ) వినియోగిస్తున్నారు. కర్ణాటకలో కూడా అదే పని చేశారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని నాశనం చేశారు’ అని విమర్శించారు.
మరోవైపు కర్ణాటకలో మాదిరిగానే మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండే వ్యవహరించారని శరద్ పవార్ ఆరోపించారు. మధ్యప్రదేశ్‌లో కూడా ఎమ్మెల్యేలను చీల్చి కమల్‌నాథ్ ప్రభుత్వాన్ని బీజేపీ పడగొట్టిందన్నారు. గోవాలో కూడా ఆ పార్టీ అలాగే చేసిందని మండిపడ్డారు. ప్రభుత్వ యంత్రాంగం, వనరులను వినియోగించుకుని రాష్ట్రాల్లోని ప్రభుత్వాలను కూలదోస్తున్న ఈ కొత్త విధానం ఆందోళనకరమని అన్నారు. అయితే ఇలాంటి రాజకీయాలు ప్రజలకు నచ్చడం లేదన్నది కర్ణాటక ఫలితం తేల్చి చెప్పిందన్నారు.
కర్ణాటక ఎన్నికల్లో ఎన్సీపీ కూడా పోటీ చేసిందని, అయితే అది ఒక ప్రయత్నం మాత్రమేనని శరద్ పవార్ తెలిపారు. కర్ణాటకలో బీజేపీని ఓడించేందుకు కొత్త రాష్ట్రంలో అడుగుపెట్టాలని ఎన్సీపీ నిర్ణయించిందని చెప్పారు. మహారాష్ట్రలో ఎన్సీపీ ఒంటరిగా పోటీ చేయదని అన్నారు. ఉద్ధవ్ సేన, కాంగ్రెస్‌తోపాటు ఇతర చిన్న పార్టీలను కలుపుకుని ముందుకు వెళ్తామన్నారు. అయితే తాను ఒంటరిగా ఈ నిర్ణయం తీసుకోబోనన్న శరద్ పవార్, మిగతా వారితో కలిసి దీనిపై చర్చిస్తానని అన్నారు.
कर्नाटक निवडणुकीच्या निकालाच्या पार्श्वभूमीवर आज मुंबई येथील यशवंतराव चव्हाण सेंटर इथे माध्यम प्रतिनिधींशी संवाद साधला.
राष्ट्रवादी काँग्रेस पक्ष हा कर्नाटकात शक्तीशाली पक्ष आहे अशी काही स्थिती नाही. आम्ही एक प्रयत्न म्हणून काही उमेदवार उभे केले. त्यापैकी निपाणी मतदारसंघातील…
— Sharad Pawar (@PawarSpeaks) May 13, 2023