ఓ ఆడబిడ్డ పెళ్లి ఆగిపోవడానికి కట్నం కారణం కావొచ్చు.. లేదంటే కాబోయే భర్త అలవాట్లు, సంపాదన, ఉద్యోగం.. ఇలాంటివి ఆటంకాలవడం మనం విన్నాం. కానీ..ఓ ఆడబిడ్డ పెళ్లికి ఏనుగులు అడ్డంకిగా మారాయని ఎప్పుడైనా విన్నామా? నిజమా? ఆడబిడ్డల పెళ్లికి ఏనుగులు అడ్డంకా? మీరు విన్నది నిజమే. ఈ సమస్య ఛత్తీస్‌గఢ్‌లో ఎదురవుతోంది. ఛత్తీస్‌గఢ్‌లోని ప్రతాప్ పూర్లో ఏనుగులు సృష్టిస్తున్న బీభత్సానికి స్థానికుల నివాసాలు మొత్తం ధ్వంసమైపోతున్నాయి. దీంతో ప్రజలు గజగజ వణికిపోతూ… తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. 2018 నుంచి 2020 వరకూ ఏనుగులు చేసిన దాడిలో 204 మంది స్థానికులు ప్రాణాలు కోల్పోయారు.
అలాగే… స్థానికుల ఆగ్రహంతో 45 ఏనుగులు కూడా మృత్యువాతపడ్డాయి. గతేడాది డిసెంబర్లోనే 11 మంది ఏనుగుల దాడిలో ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయంపై ప్రతాప్పూర్ సర్పంచ్ మాట్లాడుతూ… ‘ఏనుగులు ప్రజల నివాసాలపై దాడులు చేస్తున్నాయి. ప్రజల్ని చంపేస్తున్నాయి. దీంతో ఆడబిడ్డలకు పెళ్లిళ్లు చేయడం కష్టమైపోతోంది. ఏనుగులు సృష్టిస్తున్న బీభత్సానికి మా గ్రామానికి చెందిన ఆడపిల్లలను ఎవరూ పెళ్లి చేసుకోవడం లేదు. వియ్యం అందుకోవడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. ఇదంతా ఏనుగులు సృష్టిస్తున్న బీభత్సం మూలానే’ అంటూ సర్పంచ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.