న్యూఢిల్లీ : ఆకాశంలో ఆనందంగా విహరిస్తూ హఠాత్తుగా మేఘాల్లో చిక్కుకుపోతే ఎలా ఉంటుంది? అలాంటి విపత్కర పరిస్థితి ఓ చైనీస్ పారాైగ్లెడర్కు వచ్చింది. అయితే పెంగ్ యుజియాంగ్ (55) అనేక ప్రతికూల పరిస్థితులను సాహసోపేతంగా తట్టుకుని, తిరిగి భూమిపైకి చేరుకోగలిగారు. ఆయన సెకండ్ హ్యాండ్ పారాైగ్లెడింగ్ ఎక్విప్మెంట్ను పరీక్షించే సమయంలో హఠాత్తుగా ఆయనను మేఘాలు పీల్చేసుకున్నాయి. దాదాపు 3,000 మీటర్ల ఎత్తులో ఈ ‘క్లౌడ్ సక్’ ఎదురైంది.
దీంతో ఆయన అత్యంత వేగంగా 8,598 మీటర్ల (సుమారు 28,000 అడుగుల) ఎత్తుకు దూసుకెళ్లిపోయారు. ఆయన శరీరమంతా మంచుతో కప్పబడి ఉన్నట్లు కనిపిస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం వైరల్ అవుతున్నది. మంచు వల్ల ఒళ్లంతా తిమ్మిరి ఎక్కడం, ఆక్సిజన్ లెవెల్స్ ప్రమాదకర స్థాయికి పోయినా ఆయన నిరంతరం స్పృహలో ఉండేందుకు ప్రయత్నిస్తూ, కాంపాస్ సాయంతో నేలపైకి దిగగలిగారు. చిట్టచివరికి ఈశాన్య దిశలో కిందికి దిగడానికి ప్రయత్నించి, విజయం సాధించానని తెలిపారు.
ఏవియేషన్ నిపుణుడు వాంగ్ యనన్ మాట్లాడుతూ, క్లౌడ్ సక్ (మేఘాలు పీల్చుకోవడం) అత్యంత అరుదుగా జరుగుతుందన్నారు. క్యుములోనింబస్ మేఘాల సమీపంలోని బలమైన గాలి తరంగాల్లోకి పారాైగ్లెడర్లు వెళ్లినపుడు ఇది జరుగుతుందని తెలిపారు. హఠాత్తుగా సంభవించే ఈ పరిస్థితిని ముందుగా అంచనా వేయడం కష్టమని, చాలా తీవ్రంగా, ప్రమాదకరంగా ఉంటుందని చెప్పారు.