భోపాల్: మధ్యప్రదేశ్‌లోని మొరేనా జిల్లా దవాఖానలో భారీ అగ్నిప్రమాదం (Fire Accident) జరిగింది. దవాఖానలోని ఆపరేషన్ థియేటరలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా మంటలు సర్జికల్ వార్డుకు విస్తరించాయి. దీంతో పొగలు దట్టంగా అలముకున్నాయి. దీంతో అప్రమత్తమైన సిబ్బంది, రోగుల సహాయకులు అక్కడ చికిత్స పొందుతున్నవారిని రక్షించేందుకు ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఆక్సిజన్ మాస్క్‌ను తొలగించడంతో ఓ రోగి మరణించారు.
ప్రాణాలను రక్షించేందుకు చేసిన ప్రయత్నంలో ఓ రోగి చనిపోవడం విషాదకరమని జిల్లా ఎస్పీ దీపాలి చండోరియా వెల్లడించారు. షార్ట్ సర్క్యూట్ వల్ల దవాఖానలో మంటలు చెలరేగాయి. మంటలు క్రమంగా విస్తరిస్తుండటం, పోగలు అలముకోవడంతో సర్జికల్ వార్డులో ఉన్న రోగులను వారి సహాయకులు సురక్షితంగా బయటకు తీసుకెళ్లారు. మరికొందరు రోగులు వారే సెలైన్ డ్రిప్‌లను తీసేసుకుని దవాఖాన నుంచి బయటకు పరుగులు పెట్టారు. అయితే ఓ రోగిని రక్షించే క్రమంలో అతనికున్న ఆక్సిన్ మాస్క్‌ను తొలగించారు. దీంతో అతడు ఊపిరాడక చనిపోయాడని వెల్లడించారు. అగ్నిప్రమాద ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.