న్యూఢిల్లీ, అక్టోబర్ 11: 2016లో పఠాన్‌కోట్‌లోని భారత వైమానిక దళం బేస్‌పై దాడికి ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న షాహిద్ లతీఫ్ హతమయ్యాడు. బుధవారం పాకిస్థాన్‌లోని సియాల్కోట్ జిల్లా డస్కా పట్టణంలో నూర్ మదీనా మసీదులో ఉదయం ప్రార్థనలు ముగించుకుని బయటకు రాగా, కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అతడిని కాల్చి చంపారు. ముగ్గురు వ్యక్తులు జరిపిన కాల్పుల్లో అతని సోదరుడు కూడా మృతి చెందాడు. మరో వ్యక్తి గాయపడ్డాడు.
పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ నుంచి 1993లో కశ్మీర్‌లోయలోకి చొరబడిన లతీఫ్ అలియాస్ బిలాల్ నిషేధిత హకర్-ఉల్-అన్సర్ ఉగ్రవాద సంస్థ తరఫున కార్యకలాపాలు నిర్వహించే వాడు. దీంతో అతడిని ఏడాది తర్వాత అరెస్ట్ చేసి జమ్ములోని కోల్ బల్వాల్ జైలులో ఉంచారు. జేఈఎం వ్యవస్థాపకుడు మసూద్ అజర్ కూడా అదే జైలులో ఉండేవాడు. అక్కడ లతీఫ్‌కు మసూద్ అజార్ ఉగ్రవాదంపై బ్రెయిన్ వాష్ చేశాడు. అయితే కొందరు ఉగ్రవాదులు భారత్‌కు చెందిన విమానాన్ని హైజాక్ చేసి ఖాందహార్ తీసుకెళ్లి, ప్రయాణికులను వదిలిపెట్టేందుకు ప్రతిగా మసూద్ అజర్‌ను విడిపించుకుని పోయారు.
అప్పటి యూపీఏ ప్రభుత్వం 16 ఏండ్ల శిక్ష తర్వాత లతీఫ్‌ను 2010లో జైలు నుంచి విడుదల చేసింది. ఆ తర్వాత పాకిస్థాన్ వెళ్లిపోయిన లతీఫ్ జైషేలో చేరి ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహించే వాడు. 2016 జనవరి 2న పఠాన్‌కోట్‌లోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌పై జేఈఎం ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ ఘటనలో ఏడుగురు జవాన్లు ప్రాణా లు కోల్పోయారు. నలుగురు ఉగ్రవాదులను బలగాలు మట్టుబెట్టాయి. పఠాన్‌కోట్ దాడికి షాహిద్ లతీఫే ప్రధాన సూత్రధారి అని అప్పట్లో మన నిఘా వర్గాలు నిర్ధారించాయి.