ముంబై: జైపూర్-ముంబై రైలులో ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ చేతన్ సింగ్(RPF Constable Chetan Singh:) జరిపిన కాల్పుల్లో నలుగురు మృతిచెందిన విషయం తెలిసిందే. ఆ కేసులో పోలీసుల విచారణ కొనసాగుతోంది. అయితే ఆ రైలులోని బీ2 బోగీలో ఉన్న ఓ ప్రయాణికుడిని పాయింట్ బ్లాంక్ రేంజ్లో కానిస్టేబుల్ చేతన్ బెదిరించినట్లు తెలుస్తోంది. అంతేకాదు తుపాకీని గురిపెట్టి ఆ ప్రయాణికుడిని ప్యాంట్రీ కార్ వద్దకు తీసుకువెళ్లినట్లు కొందరు చెబుతున్నారు. అక్కడ ఆ ప్రయాణికుడిని చేతన్ షూట్ చేసినట్లు తెలుస్తోంది. జీర్పీఎఫ్ పోలీసులు తమ విచారణలో ఈ విషయాన్ని వెల్లడించారు.
33 ఏళ్ల చేతన్ సింగ్.. తన సీనియర్ అయిన టికా రామ్ మీనాను కూడా షూట్ చేశాడు. పాల్గర్ రైల్వే స్టేషన్ వద్ద తన వద్ద ఉన్న ఆటోమెటిక్ వెపన్తో మరో ముగ్గుర్ని ప్రయాణికుల్ని కూడా కాల్చేశాడతను. అయితే బీ2 ఏసీ బోగీలో ట్రావెల్ చేస్తున్న సయ్యిద్ అనే ప్రయాణికుడిని గన్‌పాయింట్‌లో బెదిరిస్తూ ప్యాంట్రీ కారు వద్దకు తీసుకువెళ్లినట్లు జీఆర్పీఎఫ్ అధికారి తెలిపారు. బీ2, బీ1 కోచ్‌లను దాటేసి ప్యాంట్రీ కార్ చేరుకున్నారని, దాన్ని ఇతర ప్రయాణికులు చూసినట్లు చెప్పారు.
అయిదు బోగీల్లో ఉన్న ప్రయాణికుల నుంచి సమాచారాన్ని రాబట్టేందుకు జీఆర్పీఎఫ్ పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే డజన్ల సంఖ్యలో ప్రయాణికుల నుంచి స్టేట్మెంట్ తీసుకున్నారు. నిందితుడు చేతన్ సింగ్‌పై మెడికల్ పరీక్షలు నిర్వహించారు. కానీ అతను ఏ ఉద్దేశంతో కాల్పులకు తెగించాడో అర్థం కావడం లేదు. విచాణ కోసం ప్రయాణికుల సమాచారాన్ని కూడా సేకరిస్తున్నారు.
అబ్దుల్ ఖాదర్‌భాయ్ మొహమ్మద్ హుస్సేన్, అస్గర్ అబ్బాస్ షేక్, సయ్యిద్ ఎస్ అనే ప్రయాణికుల్ని చేతన్ షూట్ చేశాడు. బీ5 కోచ్‌లో ఉన్న ఓ ప్రయాణికుడు, ఎస్6లో ఉన్న మరో ప్రయాణికుడిని అతను హతమార్చాడు. బీ5 నుంచి ఎస్6 బోగీ మధ్య దాదాపు 8 బోగీలు ఉన్నాయి. అయితే కానిస్టేబుల్ చేతన్ ఆ ముగ్గుర్ని ఎందుకు చంపాడో స్పష్టంగా తెలియదంటున్నారు.