న్యూఢిల్లీ : సభాధ్యక్షుడు ఇచ్చిన ఆదేశాలను సభ లోపల, వెలుపల ఎవరూ విమర్శించకూడదని శీతాకాల సమావేశాలకు ముందు రాజ్యసభ జారీచేసిన బులెటిన్ స్పష్టం చేసింది. సభ లోపల థ్యాంక్స్, థ్యాంక్ యూ, జై హింద్, వందే మాతరం వంటి ఏ నినాదాన్ని చేయకూడదని కూడా బులెటిన్ పేర్కొంది. సభ లోపల ఎటువంటి వస్తువులను ప్రదర్శించకూడదని, తోటి సభ్యుడిని లేదా మంత్రిని ఏ సభ్యుడైనా విమర్శించిన పక్షంలో సంబంధిత సభ్యుడు సభలో దీనికి జవాబు ఇచ్చిన సమయంలో విమర్శించిన సభ్యుడు తప్పనిసరిగా సభలో ఉండాలని బులెటిన్ తెలిపింది.
కాగా, పార్లమెంట్లో జై హింద్, వందే మాతరం వంటి నినాదాలపై ఆంక్షలు విధించడాన్ని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్రంగా వ్యతిరేకించారు. ఎందుకు చెప్పకూడదు? వందే మాతరం మన జాతీయ గీతం. జై హింద్ మన స్వాతంత్య్ర నినాదం. మన నేతాజీ నినాదం. వీటితో పెట్టుకుంటే నాశనం అయిపోతారు అని ఆమె హెచ్చరించారు.