న్యూఢిల్లీ: పార్లమెంట్ ( Parliament ) ఉభయసభల్లో విపక్ష సభ్యుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. రాజ్యసభలో 12 మంది ఎంపీలపై సస్పెన్షన్ ఎత్తివేయాలని, లఖింపూర్ ఖేరి ఘటనకు బాధ్యత వహిస్తూ ప్రధాన నిందితుడు అశీశ్ మిశ్రా తండ్రి, కేంద్రమంత్రి అజయ్ మిశ్రా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఉభయసభల్లో విపక్ష సభ్యులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. లోక్సభలో సభ్యులు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు.
స్పీకర్ ఎంత నచ్చజెప్పినా సభ్యులు వినిపించుకోలేదు. దాంతో సభను మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా వేశారు. ఇక రాజ్యసభలో కూడా విపక్ష ఎంపీల ఆందోళన కంటిన్యూ అయ్యింది. ఛైర్మన్ వెల్లోకి వెళ్లి నినాదాలు చేశారు. ఛైర్మన్ వెంకయ్య నాయుడు వెనక్కి వెళ్లాలని సూచించినా వాళ్లు లెక్కచేయలేదు. దాంతో ప్రభుత్వం, విపక్షాలు సమస్యపై సభ వెలుపల మాట్లాడుకుని ఒక పరిష్కారానికి రావాలని ఆయన సూచించారు. అందుకోసం సమయం ఇస్తూ సభను సోమవారానికి వాయిదా వేశారు.