న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు (Parliament Monsoon Session) సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. జూలై 21 నుంచి ఆగస్టు 21 వరకు సమావేశాలు జరుగనున్నాయి. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ తర్వాత మొదటిసారిగా ఉభయ సభలు సమావేశమవుతున్నాయి. 21 రోజులపాటు జరుగనున్న ఈ సమావేశాలు వాడీవేడిగా కొనసాగే అవకాశాలున్నాయి. ఈ సందర్భంగా ఏడు పెండింగ్ బిల్లులతోపాటు 8 కొత్త బిల్లులను ప్రవేశపెట్టడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. నేషనల్ స్పోర్ట్స్ గవర్నెన్స్ బిల్లు, జియోహెరిటేజ్ సైట్స్, జియో రెలిక్స్ (సంరక్షణ, నిర్హణ) బిల్లు, మైన్స్ అండ్ మినరల్స్ (అభివృద్ధి, నియంత్రణ) సవరణ బిల్లు, నేషనల్ యాండీ డోపింగ్ (సవరణ) బిల్లు, మణిపూర్ వస్తు సేవల పన్ను (సవరణ) బిల్లు వంటివి ఇందులో ఉన్నాయి. వీటితోపాటు ఇన్కం ట్యాక్స్-2025 బిల్లును కూడా కేంద్రం ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అలహాబాద్ హైకోర్టు సిటింగ్ న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్వర్మను అభిశంసించే తీర్మానం కూడా ఈ సమావేశాలలోనే పార్లమెంటు ముందుకు రానుంది.
కాగా, ఆపరేషన్ సింధూర్ తర్వాత ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలని పట్టుబట్టిన ఇండియా కూటమికి.. భారత్, పాక్ యుద్ధంలో 5 యుద్ధ విమానాలు నేలకూలాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఆయుధంగా మారనున్నాయి. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్, బీహార్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ, జమ్మూకాశ్మీర్ రాష్ట్ర హోదా పునరుద్ధరణ అంశాలపై ప్రతిపక్షాలు చర్చలకు పట్టుబట్టే అవకాశాలున్నాయి.
18వ పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నేడు అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది. పార్లమెంటు భవన సముదాయంలోని ప్రధాన హాల్లో పార్లమెంటరీ వ్యవహారాలు, మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే సమావేశంలో కేంద్ర మంత్రులతో పాటు, ప్రతిపక్షాలకు చెందిన పార్లమెంటరీ పార్టీ నేతలు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా సభ సజావుగా సాగేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు.