న్యూఢిల్లీ: మోకాలి గాయం నుంచి త్వరగా కోలుకునేందుకు బాలీవుడ్ ఫిల్మ్ స్టార్ పరేశ్ రావల్(Paresh Rawal) స్వంత మూత్రాన్ని తాగాడట. హిందీ పత్రిక ద లలన్టాప్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని చెప్పారు. రాజ్‌కుమార్ సంతోషి తీసిన ఘాతక్ చిత్రం షూటింగ్ సమయంలో అతను గాయపడ్డాడు. అయితే ఆ సమయంలో ముంబైలోని నానావతి ఆస్పత్రిలో అతన్ని చేర్పించారు. కెరీర్ ముగిసిపోతుందో ఏమో అన్న భయంలోకి వెళ్లిపోయినట్లు అతను చెప్పాడు. కానీ నటుడు అజయ్ దేవగన్ తండ్రి , యాక్షన్ డైరెక్టర్ వీరూ దేవన్ తనకు ఓ సలహా ఇచ్చినట్లు తెలిపాడు. ఆస్పత్రికి విజిట్ చేసిన వీరూ దేవగన్.. త్వరగా గాయం నుంచి కోలుకోవాలంటే స్వంత మూత్రాన్ని తాగాలని సలహా ఇచ్చినట్లు చెప్పాడు.
వీరూ దేవగన్‌కు తన కాలి గురించి చెప్పానని, అయితే ప్రతి రోజు ఉదయం మూత్రాన్ని తాగాలని అతను చెప్పినట్లు పరేశ్ రావల్ గుర్తు చేశాడు. ఫైటర్లు అందరూ ఇదే చేస్తారని, ఇలా చేస్తే ఎటువంటి సమస్య ఉండదని, ఉదయం కేవలం మూత్రం మాత్రమే తాగాలని చెప్పినట్లు పరేశ్ రావల్ తెలిపాడు. అయితే ఆ సమయంలో మద్యం కానీ, మటన్ కానీ, పొగ త్రాగడం కానీ చేయవద్దు అని చెప్పినట్లు వెల్లడించాడు. యధావిధిగా ప్రతి రోజు తీసుకునే ఆహారాన్ని తింటూనే, ఉదయం మాత్రం స్వంత మూత్రం తాగాలని వీరూ సలహా ఇచ్చినట్లు పరేశ్ తెలిపాడు. బీర్ తరహాలో తన మూత్రాన్ని తానే తాగినట్లు చెప్పాడు.
వీరూ దేవగన్ చెప్పినట్లే చెశానని, 15 రోజుల్లో గాయం నయమైందని, ఎక్స్ రే రిపోర్టులను డాక్టర్లు చూసి ఆశ్చర్యపోయారని పరేశ్ రావల్ పేర్కొన్నాడు. సాధారణంగా ఆ గాయం తగ్గాలంటే రెండు నుంచి రెండున్నర నెలల సమయం పట్టే అవకాశం ఉంటుందని, కానీ నెలన్నర రోజుల్లోనే పూర్తిగా కోలుకున్నట్లు పరేశ్ రావల్ తెలిపాడు.
ప్రస్తుతం అక్షయ్ కుమార్, టాబూ కలిసి చేస్తున్న భూత్ బంగ్లా హారర్ కామిడీ చిత్రంలో పరేశ్ రావల్ నటిస్తున్నాడు. అక్షయ్ కుమార్, సునీల్ శెట్టి కలిసి తీస్తున్న హీరా పేరీ-3లోనూ పరేశ్ యాక్టింగ్ చేస్తున్నాడు.