Pakistani intruder : భారత (Indian) భూభాగంలోకి చొరబడేందుకు యత్నించిన పాకిస్థాన్ (Pakistan) వ్యక్తిని సరిహద్దు భద్రతా దళాలు (BSF) కాల్చిచంపాయి. శుక్రవారం (Friday) అర్ధరాత్రి (అంటే తెల్లవారితే శనివారం) గుజరాత్ (Gujarat) లోని బనస్కాంత్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ విషయాన్ని భద్రతా బలగాలు (Security forces) ఒక ప్రకటనలో వెల్లడించాయి.
బీఎస్ఎఫ్ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. సరిహద్దును దాటి కంచె వైపు వస్తున్న ఓ పాకిస్థాన్ వ్యక్తిని భారత జవాన్లు గుర్తించారు. వెంటనే అప్రమత్తమై అతడిని నిలువరించేందుకు ప్రయత్నించారు. అక్కడే ఆగిపోవాలని హెచ్చరించారు. అయినా అతడు లెక్కచేయకుండా ముందుకు రావడంతో కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో అతడు ప్రాణాలు కోల్పోయాడు.
పహల్గాం ఉగ్రదాడి జరిగినప్పటి నుంచి సరిహద్దుల్లో భద్రతను బలగాలు కట్టుదిట్టం చేశాయి. ఏప్రిల్ 22న పహల్గాంలో ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపి 26 మంది ప్రాణాలు తీశారు. అందుకు ప్రతిగా భారత్ ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్థాన్లోని, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రస్థావరాలను నేలమట్టం చేసింది. దీన్ని సహించని పాక్ సైన్యం మనపై ఎదురుదాడికి పాల్పడి భారత బలగాల చేతిలో చావుదెబ్బ తిన్నది. ప్రస్తుతం ఇరుదేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతోంది