లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని మూడు నగరాల్లో గాలి కాలుష్యానికి పాకిస్థాన్ కారణమని కాలుష్య నియంత్రణ మండలి అధికారి ఆరోపించారు. (UP Pollution) పొరుగుదేశంలో వ్యవసాయ వ్యర్థాలను తగులబెట్టడం వల్ల గ్రేటర్ నోయిడా, నోయిడా, ఘజియాబాద్‌లో గాలి విషపూరితంగా మారిందన్నారు. ఈ మూడు నగరాల్లో గాలి నాణ్యత సూచి (ఏక్యూఐ) దారుణంగా పడిపోయింది. నోయిడాలో 304, గ్రేటర్ నోయిడాలో 312, ఘజియాబాద్‌లో 324 మేర ఏక్యూఐ నమోదైంది.
కాగా, గ్రేటర్ నోయిడాలోని ఉత్తరప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయ అధికారి డీకే గుప్తా గాలి కాలుష్యం గురించి మీడియాతో మాట్లాడారు. ‘ఈ ఏడాది నోయిడా, గ్రేటర్ నోయిడా, ఘజియాబాద్‌లో ఒకే రోజు గాలి నాణ్యత సూచి దారుణంగా పడిపోవడం ఇదే మొదటిసారి. మన పొరుగు దేశం పాకిస్థాన్‌ను నిందించాల్సిన అవసరం ఉంది. ఆ దేశంలో పంట వ్యర్థాలను తగులబెట్టడం వల్ల ఈ మూడు నగరాల్లో గాలి విషపూరితంగా మారింది’ అని అన్నారు.
మరోవైపు ఉత్తరప్రదేశ్ నుంచి 500 కిలోమీటర్ల దూరంలో పాకిస్థాన్ ఉన్నది. దీంతో ఆ రాష్ట్రంలో గాలి కాలుష్యానికి పొరుగు దేశం కారణమని కాలుష్య నియంత్రణ మండలి అధికారి ఆరోపించడంపై విమర్శలు వెల్లువెత్తాయి.