Indian Railway | భారత్-పాక్ మధ్య ఉద్రిక్తలు మరింత పెరిగాయి. పెహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని తొమ్మిది ఉగ్రస్థావరాలపై దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో భారత దేశ భద్రతలో కీలకమైన సైన్యం రాకపోకల వివరాలను పాక్ గూఢచార సంస్థలు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో భారతీయ రైల్వే అప్రమత్తమైంది. రైల్వేశాఖకు సంబంధించిన రహస్య సమాచారాన్ని అనధికారిక వ్యక్తులతో పంచుకోవద్దని రైల్వే బోర్డు ఉద్యోగులకు సూచించింది. సైన్యానికి చెందిన రైళ్ల కదలికలకు సంబంధించిన కీలక వివరాలను సేకరించేందుకు పాక్ స్పై ఏజెన్సీలు ప్రయత్నించేందుకు ఆస్కారం ఉందని రైల్వే ఆందోళన వ్యక్తం చేసింది. ఈ క్రమంలో ఈ నెల 6న ఉద్యోగులకు జారీ చేసిన అడ్వైజరీలో సూచన చేసింది. కీలకమైన విషయాలు బయటకు పొక్కితే అది జాతీయ భద్రతకు తీవ్రమైన ముప్పుగా మారే అవకాశం ఉంటుందని పేర్కొంది.
ఈ క్రమంలో రైల్వేలోని నిర్దేశిత మిలటరీ విభాగానికి చెందిన వారికి తప్పా.. మరో అనధికారిక వ్యక్తికి సమాచారం ఇస్తే అది సెక్యూరిటీ రూల్స్ అధిగమించడం కిందకే వస్తుందని స్పష్టం చేసింది. ఉద్రిక్త పరిస్థితుల్లో సైనిక రైళ్ల కదలికల సమాచారానికి ఉన్న ప్రాధాన్యం, తీవ్రత, జాతీయ భద్రతను దృష్టిలో పెట్టుకొని అధికారులు, సిబ్బంది అంతా అప్రమత్తంగా ఉండాలని బోర్డు రైల్వే జోన్ల ప్రిన్సిపల్ చీఫ్ ఆపరేషన్ మేనేజర్లకు అడ్వైజరీ జారీ చేసింది. మిల్ రైల్ అనేది భారత రైల్వేలలో రక్షణ దళాలకు లాజిస్టికల్ సపోర్ట్‌ని అందించే ప్రత్యేక విభాగం. ఇది సైనిక వ్యూహాత్మక ప్రణాళికల అమలులో కీలకపాత్ర పోషిస్తుంది. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు, యుద్ధ సమయాల్లో సైనికులు, భారీ యుద్ధ ట్యాంకులు, ఇతర ఆయుధ సంపత్తిని, సామగ్రిని తరలించేందుకు రైళ్లను వినియోగిస్తుంది. సంప్రదింపులన్నీ రైల్వే బోర్డు ద్వారా కాకుండా నేరుగా సైనిక విభాగం ద్వారానే జరుగుతుంటాయి. దీని ప్రధాన కార్యాలయం దేశ రాజధాని ఢిల్లీలో ఉంది.