కోల్‌కతా, జూన్ 28: న్యాయ విద్యార్థినిపై సామూహిక అత్యాచార ఘటనపై నిరసనలు వెల్లువెత్తుతున్న వేళ పశ్చిమ బెంగాల్లో మరో దారుణం చోటుచేసుకుంది. పాఠశాలలో ఉద్యోగం ఇప్పిస్తానని మభ్యపెట్టి పద్మశ్రీ అవార్డు గ్రహీత స్వామి కార్తీక్ మహారాజ్ 2013లో తనపై పలుసార్లు లైంగిక దాడి చేశాడని ఒక మహిళ ఆరోపించింది. భారత్ సేవాశ్రమ సంఘ్ స్వామీజీ కార్తీక్ మహరాజ్ ఆశ్రమంలోని పాఠశాలలో ఉద్యోగం ఇప్పిస్తానని తనను ముర్షిదాబాద్‌లోని ఆశ్రమానికి తీసుకుని పోయి ఆశ్రయం కల్పించాడని ఆ మహిళ తెలిపింది.
ఒక రాత్రి వేళ స్వామి తన గదిలోకి ప్రవేశించి తనపై లైంగిక దాడి చేశాడని తెలిపింది. అలా 2013 జనవరి-జూన్ మధ్య తనపై 12 సార్లు లైంగిక దాడి చేశాడని ఆమె ఆరోపించింది. భయం, నిస్సహాయత, అతనికున్న పలుకుబడి కారణంగానే తాను ఇన్నాళ్లు ఈ విషయాన్ని వెల్లడించలేక పోయానని ఆమె తెలిపింది. తాను కనుక పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఆత్మహత్య చేసుకుంటానని స్వామీజీ తనను బెదిరించాడని తెలిపింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. కాగా, ఈ ఏడాది పద్మశ్రీ అవార్డు పొందిన స్వామీజీకి రాజకీయంగా బీజేపీతో సంబంధాలు ఉండటంతో ఈ కేసు రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది.