బెంగళూరు: అస్సాం రాష్ట్రానికి చెందిన ఒక యువకుడ్ని బజరంగ్ దళ్ సభ్యులు స్తంభానికి కట్టేసి కొట్టారు. బీజేపీ పాలిత కర్ణాటకలోని చిక్మగళూరు జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఆదివారం మధ్యాహ్నం ముదిగెరెలో అస్సాంకు చెందిన ఒక యువకుడు ద్విచక్ర వాహనంపై వెళ్తున్నాడు. అయితే అతడి వద్ద ఉన్న సంచిలో గొడ్డు మాంసం ఉన్నట్లు బజరంగ్ దళ్ సభ్యులు అనుమానించారు. ఆ యువకుడ్ని అడ్డుకున్నారు. అతడ్ని ఒక స్తంభానికి కట్టేసి కొట్టారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకున్నారు. అస్సాం యువకుడ్ని కాపాడారు. అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. ఆ వ్యక్తి సంచిలో ఉన్నది గొడ్డు మాంసమేనా అన్నదానిపై దర్యాప్తు చేస్తున్నారు.
కాగా, కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వం 2021 జనవరిలో పశు వధ నిరోధక చట్టాన్ని అమలులోకి తెచ్చింది. దీని ప్రకారం ఆ రాష్ట్రంలో పశువులను (ఆవులు, ఎద్దులు లేదా దున్నలు) రవాణా చేయడం, వధించడం లేదా వ్యాపారం చేయడం చట్టవిరుద్ధం. అయితే 13 ఏళ్లు పైబడిన గేదెలను వధించడాన్ని ఈ చట్టంలో నిషేధించలేదు. అలాగే ఇతర రాష్ట్రాల నుంచి గొడ్డు మాంసం సేకరణ, రవాణాను కూడా నిషేధించలేదు. దీంతో కర్ణాటకలో గొడ్డు మాంసం ఇప్పటికీ అందుబాటులో ఉంది.