Maharashtra ATS : పాకిస్థానీ గ్యాంగ్స్టర్ (Pakistani Gangster) షాజాద్ భట్టి (Shahjad Bhatti) తో సంబంధాలు ఉన్నాయని అనుమానిస్తున్న 102 మందిపై మహారాష్ట్ర ఉగ్రవాద నిరోధక దళం (ATS) నిఘా వేసింది. షాజాద్ భట్టితో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు అనుమానిస్తున్న వ్యక్తుల ఆచూకీ, కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఆపరేషన్లో రాష్ట్రవ్యాప్తంగా 58 బృందాలు పని చేస్తున్నాయని వెల్లడించారు.
భారత యువతను ఉగ్రవాదంవైపు ఆకర్షించడానికి షాజాద్ భట్టి, అతడి సహచరులు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సప్ వంటి సోషల్ మీడియా వేదికలను ఉపయోగిస్తున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని అధికారులు చెప్పారు. డబ్బు ఆశచూపి నిరుద్యోగ యువకులను తమవైపు తిప్పుకుని భారత్లో ఉగ్ర నెట్వర్క్ను విస్తరించడానికి కుట్రపన్నినట్లు తెలిపారు. ఆర్మీకి చెందిన సున్నితమైన సమాచారాన్ని సేకరించడం, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, అక్రమ ఆయుధాల తరలింపు వంటి చర్యల్లో వీరిని ఉపయోగిస్తున్నట్లు తెలుస్తున్నది. దేశ వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొన్నట్లు తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.