బుధవారం 27 జనవరి 2021
National - Jan 07, 2021 , 12:49:31

ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ట్రాక్టర్‌ మార్చ్‌

ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ట్రాక్టర్‌ మార్చ్‌

న్యూఢిల్లీ : వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా వేలాది మంది రైతులు సింగు, తిక్రీ, ఘాజీపూర్ సరిహద్దుల్లో గురువారం ట్రాక్టర్ మార్చ్ నిర్వహించారు. సుమారు 3500పైగా ట్రాక్టర్లతో పెద్ద ఎత్తున ర్యాలీ తీస్తున్నట్లు భారతి కిసాన్ యూనియన్ (ఏక్తా ఉగ్రహాన్) చీఫ్ జోగిందర్ సింగ్ ఉగ్రహాన్ తెలిపారు. జనవరి 26న నిర్వహించే పరేడ్‌లో భాగంగా సన్నాహకంగా ర్యాలీ తీసినట్లు పేర్కొన్నారు. ఉదయం 11 గంటల సమయంలో ట్రాక్టర్‌ మార్చ్‌ ప్రారంభమైంది. కుండ్లి, మనేసర్ పాల్వాల్ ఎక్స్‌ప్రెస్ హైవేపై సాగింది. ర్యాలీ నేపథ్యంలో ఢిల్లీ, హర్యానా సరిహద్దుల్లో పోలీస్‌ సిబ్బంది భారీగా మోహరించారు. తమ డిమాండ్లను అంగీకరించకపోతే నిరసన మరింత తీవ్రతరం చేస్తామని కిసాన్‌ మోర్చా సంయుక్త్‌ కిసాన్‌ మోర్చా సీనియర్‌ సభ్యుడు అభిమన్యు కోహన్‌ పేర్కొన్నారు. తీవ్రమైన చలి, వర్షాలు కురుస్తున్నా పట్టువీడకుండా రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో 40 రోజులుగా ఆందోళన చేస్తున్నారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, పంటలకు కనీస మద్దతు ధర, చట్టపరమైన హామీ ఇవ్వాలని కోరుతున్నారు. ఇదిలా ఉండగా.. కేంద్ర మంత్రులతో సోమవారం జరిగిన చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. ఇరువర్గాల మధ్య శుక్రవారం మరోసారి చర్చలు జరుగనున్నాయి.


logo