న్యూఢిల్లీ: దేశంలో నెలకొన్న సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే కేంద్రం చారిత్రక ప్రాంతాల పేర్ల మార్పు ఎత్తుగడను ఎంచుకున్నదని ప్రతిపక్షాలు విమర్శించాయి. పేర్ల మార్పుతో ప్రజల సమస్యలు తీరుతాయా అని ప్రశ్నించాయి. రాష్ట్రపతి భవన్లోని మొఘల్ గార్డెన్స్ పేరును కేంద్రం అమృత్ ఉద్యాన్ గా మార్చడంపై విమర్శలు వస్తున్నాయి. ‘ద్రవ్యోల్బణం, పేదరికం, నిరుద్యోగం వంటి సమస్యలతో దేశ ప్రజలు ఒత్తిడితో జీవిస్తున్నారు. వీటి పరిష్కారంపై దృష్టి పెట్టకుండా పేర్ల మార్పు, విద్వేష ప్రసంగాలతో ప్రజల దృష్టి మరల్చడం సరికాదు’ అని బీఎస్పీ అధినేత్రి, యూపీ మాజీ సీఎం మాయావతి విమర్శించారు.
మొఘలాయ్ పరాఠా, ఈడెన్ గార్డెన్స్ పేర్లూ మారుస్తారేమో
దేశ చరిత్రను తిరిగి రాయాలని, జాతీయతను పునర్నిర్వచించాలనేది ఆర్ఎస్ఎస్ ఎజెండా అని, ఇది ఎప్పుడు ఆగుతుందో తెలియదని సీపీఐ ప్రధాన కార్యదర్శి రాజా విమర్శించారు. ‘మొఘలాయ్ పరాఠా పేరును స్వర్గలోక్ లేదా ఇంద్రలోక్ పరాఠాగా మారుస్తారేమో’ అంటూ టీఎంసీ ఎంపీ జవహర్ ఎద్దేవా చేశారు. ‘ఈడెన్ గార్డెన్స్ పేరును మోదీ గార్డెన్స్గా మారుస్తారేమో. ముందు ఎల్ఐసీ, ఎస్బీఐలను కాపాడటంపై దృష్టి పెట్టండి’ అంటూ ఆ పార్టీ నేత డెరిక్ ఓబ్రియన్ చురకలు అంటించారు.