న్యూఢిల్లీ, ఆగస్టు 11: బీహార్‌లో ఓటర్ల జాబితా సవరణ, ఓట్ చౌర్యానికి వ్యతిరేకంగా పార్లమెంట్ హౌస్ నుంచి ఎన్నికల కమిషన్ కార్యాలయం వరకు సోమవారం ప్రతిపక్ష ఎంపీలు నిరసన ర్యాలీ చేపట్టారు. అయితే వీరిని పోలీసులు మధ్యలోనే అడ్డుకుని అదుపులోకి తీఅసుకున్నారు. ఎన్నికల కమిషన్ కార్యాలయం వరకు ప్రతిపక్ష ఎంపీలు వెళ్లకుండా మధ్యలోనే పీటీఐ భవనం వెలుపల బారికేడ్లు వేసి అడ్డుకోవడంతో అక్కడే రోడ్డుపై బైఠాయించి ఎంపీలు నిరసన తెలిపారు. టీఎంసీ ఎంపీ మహువా మొయిత్ర, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ తదితరులు బారికేడ్లు ఎక్కి ఎన్నికల కమిషన్‌కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం రోడ్డు పక్కన వరసగా నిలిపి ఉంచిన బస్సులలో ఎంపీలను బలవంతంగా ఎక్కించిన పోలీసులు వారిని పార్లమెంట్ వీధి పోలీసు స్టేషన్‌కు తరలించారు. కొద్దిసేపటి తర్వాత ఎంపీలు అందరినీ పోలీసులు విడిచిపెట్టారు.
ఇది రాజ్యాంగ పరిరక్షణ పోరు
ఇది రాజకీయ పోరు కాదని, రాజ్యాంగాన్ని పరిరక్షించే లక్ష్యంతో చేపట్టిన సమరమని లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అన్నారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న సందర్భంగా రాహుల్ మీడియాతో మాట్లాడుతూ ఈ పోరాటం ఒక వ్యక్తి, ఒక ఓటు కోసం చేస్తున్నదని చెప్పారు. తమకు స్వచ్ఛమైన, నిజాయితీతో కూడిన ఓటరు జాబితా కావాలని ఆయన చెప్పారు. యావద్దేశం ముందు నిజం ఉండగా ఎన్నికల కమిషన్ మాట్లాడలేకపోతోందని రాహుల్ వ్యాఖ్యానించారు. పోలీసులు అదుపులోకి తీసుకుంటున్న సమయంలో మహువా మొయిత్ర స్పృహతప్పి పడిపోయారు. నిరసన యాత్రలో పాల్గొన్న ప్రతిపక్ష ఎంపీలలో ఎన్సీపీ(ఎస్పీ) శరద్ పవార్, ఆర్ బాలు(డీఎంకే), సంజయ్ రౌత్(శివసేన-యూబీటీ), డెరెక్ ఓబ్రియన్(టీఎంసీ), ప్రియాంక గాంధీ(కాంగ్రెస్), అఖిలేశ్ యాదవ్(సమాజ్‌వాది పార్టీ) తదితరులు ఉన్నారు. డీఎంకే, ఆర్జేడీ, ఆప్, వామపక్షాల ఎంపీలు కూడా ఇందులో పాల్గొన్నారు.