న్యూఢిల్లీ, అక్టోబర్ 25: కొత్తగా ఆధునీకరించిన ఢిల్లీ విమానాశ్రయంలోని టెర్మినల్ 2 నుంచి ఆదివారం కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు శనివారం దీన్ని ప్రారంభించారు. ప్రయాణికులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించే ఉద్దేశంతో టెర్మినల్ 2ని ఆధునీకరించారు.
ఇందుకోసం ఈ ఏడాది ఏప్రిల్‌లో ఈ టెర్మినల్‌ను మూసివేశారు. ఆధునీకరించిన టెర్మినల్ 2లో అనేక అధునాతన టెక్నాలజీలు అందుబాటులోకి రానున్నాయి. సెల్ఫ్ బ్యాగేజ్ డ్రాప్(ఎస్‌బీడీ), కొత్త పాసింజర్ బోర్డింగ్ వంతెనలు తదితర నూతన సౌకర్యాలను సమకూర్చారు. క్యూలైన్లను తప్పించుకుని నేరుగా భద్రతా చెకింగ్లు చేసుకునేందుకు డీజీ యాత్ర సౌకర్యాన్ని కల్పించారు. వర్చువల్ సమాచార డెస్కులను ఏర్పాటు చేశారు.