చండీఘడ్ : అత్యాచారం కేసులో నిందితుడు , పంజాబ్ ఎమ్మెల్యే హర్మీత్ సింగ్ పఠాన్మజ్రాను పంజాబీ పోలీసులు అరెస్టు చేశారు. ఆర్నెళ్లుగా అతను పరారీలో ఉన్నారు. గ్వాలియర్ వద్ద అతన్ని పట్టుకున్నారు. దీని కోసం పంజాబ్ పోలీసులు భారీ ఆపరేషన్ చేపట్టారు. ఆపరేషన్ పఠాన్(Operation Pathan) పేరుతో ఎమ్మెల్యే కోసం గాలించారు. దాదాపు ఏడు రాష్ట్రాల్లో బృందాలు అతని కోసం అన్వేషించాయి. ఢిల్లీకి చెందిన ఆమ్ ఆద్మీ పార్టీ నేతలపై తీవ్ర ఆరోపణలు చేసి తప్పించుకున్న ఎమ్మెల్యే పఠాన్మజ్రా కోసం పోలీసులు తెగ వెతికారు. అతన్ని అరెస్టు చేయడం పంజాబీ పోలీసులకు ఓ పెను సవాల్‌గా మారింది.
టెక్నికల్ సమాచారం అందిన తర్వాత అతన్ని గ్వాలియర్‌లో అదుపులోకి తీసుకున్నారు. పాటియాలా ఎస్ఎస్పీ వరుణ్ శర్మ మాట్లాడుతూ 48 గంటల పాటు అత్యంత రహస్యంగా ఆపరేషన్ చేపట్టినట్లు తెలిపారు. ఎస్పీ వైభవ్ చౌదరీ నేతృత్వంలో ఈ ఆపరేషన్ సాగిందన్నారు. గత కొన్ని నెలలుగా పాటియాలా పోలీసు శాఖకు చెందిన ఆరు బృందాలు ఎమ్మెల్యే పఠాన్మజ్రా కోసం గాలించినట్లు ఆయన చెప్పారు. పరారీలో ఉన్న రేప్ నిందితుడు, ఎమ్మెల్యే విదేశాలకు వెళ్లినట్లు పుకార్లు వ్యాపించాయి. ఆస్ట్రేలియాకు వెళ్లినట్లు అనుమానాలు వ్యక్తం చేశారు.
అయితే రెండు రోజుల క్రితం ఓ బృందానికి టెక్నికల్ లీడ్ దొరికింది. ఓ హోటల్ వైఫై ఆధారంగా అతన్ని గ్వాలియర్‌లో పట్టుకున్నారు. ఆ వైఫై ద్వారా యూకే నెంబర్ వాడుతున్నట్లు గుర్తించారు. అయితే అనుమానిత వ్యక్తి పఠాన్మజ్రాగా భావించి అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆదివారం సీక్రెట్ ఆపరేషన్ ప్లాన్ చేశామన్నారు. ఆపరేషన్ పఠాన్ కోడ్‌నేమ్‌తో నిర్వహించారు.