జైపూర్, జనవరి 23 : ఖైదీల్లో సంస్కరణలు తేవడానికి ప్రవేశపెట్టిన ఓపెన్ జైలు ఇద్దరు జీవిత ఖైదీల ప్రేమకు వేదికగా మారి, తర్వాత అక్కడే సహ జీవనానికి దారితీసింది. ఇప్పుడు ఆ జంట వివాహానికి సిద్ధం కావడంతో పెండ్లి చేసుకునేందుకు 15 రోజుల పెరోల్ కూడా మంజూరైంది. వివరాల్లోకి వెళితే.. వేర్వేరు హత్య కేసుల్లో శిక్షలు పడ్డ 31 ఏండ్ల ప్రియా సేథ్, 29 ఏండ్ల హనుమాన్ ప్రసాద్‌లు జైపూర్ సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తుండగా, ఏడాది క్రితం సంగనేర్ ఓపెన్ జైలుకు తరలించారు. ఆరు నెలల క్రితం వీరిద్దరి మధ్య ఏర్పడిన ప్రేమ తర్వాత సహజీవనానికి దారితీసింది.
దీంతో వివాహం చేసుకోవాలని నిర్ణయించి, ఈ మేరకు జైలు అధికారులకు దరఖాస్తు చేసుకోగా రాజస్థాన్ హైకోర్టు సలహా మేరకు జిల్లా పెరోల్ సలహా కమిటీ బుధవారం నుంచి 15 రోజుల పాటు పెరోల్ మంజూరు చేసింది. దీంతో వారిద్దరి వివాహం వరుడి సొంత ఊరైన అల్వార్ జిల్లా బరోడామాలో జరగనుంది. ప్రియా సేథ్ 2023లో జైపూర్‌లో దేశాన్ని కుదిపేసిన టిండర్-సూట్‌కేస్ హత్య కేసులో నిందితురాలు కాగా, హనుమాన్ ప్రసాద్ 2017లో అళ్వార్‌లో ఒక వ్యక్తి, అతని ముగ్గురు కుమారులు, మేనల్లుడిని హత్య చేసిన కేసులో నిందితుడు.